జీతం మున్సిపాలిటీలో... పని ఎమ్మెల్యే ఇంటిలో.
జీతం మున్సిపాలిటీలో...
పని ఎమ్మెల్యే ఇంటిలో...
నంద్యాల, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల ఎమ్మెల్యే అవినీతిని బయటపెట్టిన వైసీపీ రెబల్ నేత గోకుల్ కృష్ణా రెడ్డి. అధికారాన్ని అడ్డంపెట్టుకొని అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిని ఆపార్టీకి చెందిన రెబల్ నేత, వైసీపీ జెడ్పిటిసి సభ్యుడు గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మున్సిపాలిటీ వేదికగా చేస్తున్న అవినీతిని బయట పెట్టారు. శనివారం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అవినీతి చిట్టాను గోకుల్ కృష్ణరెడ్డి మీడియాకు వివరించారు. నంద్యాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే తన ఇంటి పని మనిషి అయిన ప్రసాద్ ను మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా నియమించి అతన్ని ఎమ్మెల్యే తన సొంత పనులకు, ఇంటి పనులకు వినియోగించుకుంటూ మున్సిపాలిటీ ద్వార జీతం తీసుకుంటున్నాడని గోకుల్ కృష్ణా రెడ్డి ఆరోపించారు.
ఇందుకు సంబందించిన వివరాలను ఎమ్మెల్యే ఇంట్లో పని చేస్తున్న ప్రసాద్ ఐరిష్ ద్వారా మున్సిపల్ కార్యాలయం వద్ద హాజరు వేస్తున్న ఫోటోను ఆయన మీడియాకు చూపించారు. గత కొన్నేళ్ళుగా నంద్యాల మున్సిపాలిటీ శిల్పా కుటుంబ కబంధహస్తాల్లో చిక్కుకుందని గోకుల్ కృష్ణా రెడ్డి ఆరోపించారు. ఇదే విధంగా నంద్యాల మున్సిపాలిటీలో చాలామంది శిల్పా సన్నిహితులు మున్సిపల్ ఉద్యోగులుగా చలామణి అవుతున్నారని ఆయన ఆరోపించారు. మరి కొంతమంది వివరాలను సాక్ష్యాలతో ఎమ్మెల్యే మున్సిపాలిటీ ద్వారా చేస్తున్న అవినీతిని బయటపెడుతామని గోకుల్ కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల మున్సిపాలిటీలో ఓ వార్డ్ కౌన్సిలర్ భర్త నిజాముద్దీన్ అడ్డదారిలో ఉద్యోగిగా కొనసాగుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయాన్ని గోకుల్ కృష్ణా రెడ్డి చెప్పారు. నంద్యాల ప్రాంత ప్రజలు తమ కష్టాన్ని, పన్నుల రూపంలో డబ్బు చేల్లిస్తుంటే ఎంఎల్యే ఆయన అనుచరులు అడ్డదారిలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గోకుల్ కృష్ణా రెడ్డి ఆరోపించారు. నంద్యాల మున్సిపాలిటిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా పట్టించుకోకుండా మారో వైపు ఇది కదా? అబివృద్ది అంటూ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు బయటకు వస్తున్న అవినీతిని చూస్తుంటే... ఇది కాదా? అవినీతి అని నంద్యాల ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు, మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురవుతున్నా ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించోకోవడం లేదంటే నంద్యాల పరిధిలో జరుగుతున్న అవినీతి, భూ కబ్జాల వెనుక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హస్తం ఉంటుదని తాము భావిస్తున్నట్టు గోకుల్ కృష్ణా రెడ్డి ఆరోపించారు. ఎవడబ్బ సొమ్మని నంద్యాల ప్రజలు పన్ను రూపంలో చెల్లించిన డబ్బును తమ ఇంటి మనుషులకు, అనుచరులకు ఎలా పంచిపెడతారని గోకుల్ కృష్ణా రెడ్డి, స్టానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. నంద్యాల మున్సిపాలిటిలో జరుగుతున్న అవినీతి పై తాను ఎంత వరకైనా వెళ్ళడానికి సిద్దమని గోకుల్ రెడ్డి స్పష్టం చేశారు.