Delhi Metro Station@కుప్ప కూలిన డిల్లీ మెట్రో స్టేషన్ గోడ
Delhi Metro Station : కుప్ప కూలిన డిల్లీ మెట్రో స్టేషన్ గోడ.. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు.
ఢిల్లీ, ఫిబ్రవరి 08 (పీపుల్స్ మోటివేషన్):-ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) పింక్ లైన్‌లో ఉన్న గోకుల్‌పురి మెట్రో స్టేషన్‌లో ఒక భాగం గురువారం (ఫిబ్రవరి 08) కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు తన స్కూటర్‌పై వెళ్తుండగా గోడ శిథిలాలు అతనిపై పడ్డాయి. దీంతో అతను తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సమీపంలోని కరవాల్ నగర్ ప్రాంతంలోని షహీద్ భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటోన్న వినోద్ కుమార్ (53)గా గుర్తించారు. ఈ రోజు ఉదయం 11.10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) పింక్ లైన్‌లో ఉన్న గోకుల్‌పురి మెట్రో స్టేషన్‌లో గోడ కూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు నాలుగు ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి చేరవేసింది. శిథిలాల కింద చిక్కుకుకున్న వినోద్ కుమార్(53) తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది రక్షించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు. ఘటన సమయంలో అతను తన స్కూటర్‌పై వెళ్తుండగా.. గోడ శిధిలాలు అతడిపై పడ్డాయని డీసీపీ (ఈశాన్య) జాయ్ టిర్కీ తెలిపారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. దాదాపు 40-50 మీటర్ల గోడతో పాటు స్లాబ్ కూలిపోయిందని ఆయన తెలిపారు. జేసీబీలు, క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నట్లు టిర్కీ తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిందని, ప్రస్తుతానికి మెట్రో స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు డీసీపీ టిర్కీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఆయన తెలిపారు. సివిల్ డిపార్ట్‌మెంట్‌లోని ఇద్దరు అధికారులు, మేనేజర్, జూనియర్ ఇంజనీర్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. వారిపై విచారణ అదేశించారు.