పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో నీటి కోసం సైన్యం కాపలా..! నేడు ప్రపంచ జల దినోత్సవం ( మార్చి 22 )
పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో నీటి కోసం సైన్యం కాపలా..! నేడు ప్రపంచ జల దినోత్సవం ( మార్చి 22 )
జీవ మనుగడకు ఆధారమైన నీటి గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండదని తెలిసిందే. అయితే, అన్ని పదార్థాల మాదిరిగా సాధారణ రసాయిన నిమయాలను నీళ్లు పాటించవు. ఆ విరుద్ధ స్వభావం వల్లే భూమ్మీద జీవ మనుగడ సాధ్యం అయింది. మన భూగోళం మీద నీరు మొదట వాయురూపంలో ఉండేది. తేలికైన ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులతో అది రూపొందింది. చల్లబడితే అన్ని రసాయన పదార్థాల మాదిరిగా కాకుండా నీరు విస్తరిస్తుంది. అందువల్లే మంచుగడ్డలు నీటిపై ప్రవహిస్తాయి.
మార్చి 22 న ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, ‘పర్యావరణం, ప్రగతి’ అనే అంశంపై బ్రెజిల్‌లోని రియో డిజనీరియో వేదికగా 1992లో జరిగిన ఐరాస సమావేశంలో రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా ఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా పాటిస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఈ ఏడాది థీమ్‌ను“WATER FOR PEACE” ఐరాస ప్రకటించింది.
భూగర్భ జలాల ప్రాముఖ్యతపై దృష్టి సారించి, అధిక దోపిడీ గురించి అవగాహన పెంచడమే ఈ థీమ్ లక్ష్యం. వరల్డ్‌వాటర్‌డే డాట్ ఆర్గ్ ప్రకారం.. ప్రపంచంలోని మంచినీళ్లు దాదాపు భూగర్భ జలాలే. ఐరాస అంచనా ప్రకారం.. ప్రపంచంలోని 2.2 బిలియన్ల మంది ప్రజలు సురక్షితమైన నీరు అందుబాటులో లేకుండానే జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అందజేయడమే లక్ష్యంగా ఐరాస పెట్టుకుంది. ఇక, అంతరిక్షం నుంచి చూస్తే భూమి నీలి రంగులో కనిపించడానికి కారణం నీరు. భూమిపై 75 శాతం వరకూ నీటి వనరులు ఉన్నాయి.
భూగోళం మీద నీటి వనరులలో 99 శాతం ఉప్పు నీరే. ఇందులో 97 శాతం సముద్రాల్లో ఉండగా, మిగతాది నదులు, చెరువుల్లో ఉంది. తాగడానికి ఉపయోగపడే జలాలు కేవలం 1 శాతం మాత్రమే ఉన్నాయి. అందులో 0.86 శాతం చెరువులు, 0.02 శాతం నదుల్లో, మిగతా 0.12 శాతం భూగర్భ జలాలు. అంటే ప్రపంచ వ్యాప్తంగా కేవలం 0.3 శాతం ఉపయోగపడే నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వనరులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 750 కోట్ల మందికిపైగా దాహాన్ని, ఇతర అవసరాలను తీరుస్తున్నాయి.
భారత్‌లో సింధు నాగరికత, ఈజిప్టులో నైలు నది నాగరికత ఇలా ప్రపంచ నాగరికతలు నదీ తీరాలు, నీటి వనరులకు సమీప ప్రాంతంలో విలసిల్లాయి. మన చరిత్రంతా జలవనరులతోనే ముడిపడి ఉంది. జీవం నీటితో మొదలైంది.. ప్రకృతి నీటితోనే నడుస్తోంది. అభివృద్ధి జరగాలంటే నీటి వనరులు కావాలి. జీవవైవిధ్య రక్షణ, జీవం నీటితోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ తెలిసినా ఈరోజు జరుగుతున్నదేంటి? నీటిని వృధా చేస్తూ కలుషితం చేసి విషతుల్యంగా మార్చేస్తున్నాం. ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే, ఉన్న నీటిని వృధాగా నేల పాలు చేస్తున్నాం. నీటి వనరులను వ్యర్థాలతో కలుషితం చేసి తాగడానికి వీల్లేని విధంగా తయారుచేస్తున్నాం.
‘‘2050 నాటికి ఈ భూమ్మీద తాగడానికి పుష్కలమైన జలం ఉండనే ఉండదు.. జనం స్నానాలు చేయడం మానేసి శరీరానికి రసాయనిక లేపనాలు పులుముకుంటారు.. కెమికల్ బాత్ చేస్తారు.. సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం నీటి వనరుల చుట్టు కాపలా ఉంటుంది.. తలంటుకోవడానికి నీరు సరిపోక ప్రజలందరూ బోడి గుండుతో జీవిస్తారు.. స్త్రీ పురుషులందరూ రోజు తల షేవ్ చేసుకునే పరిస్థితి వస్తుంది’’ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారంటే పరిస్థితిని ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు..✍️
విషయ నిపుణులు
MURAHARI PRASAD
LECTURER-IN-ENGLISH