ఆ ప్రాంతంలో తర్వాతే ఎన్నికలు స్పష్టం చేసిన CEC
ఆ ప్రాంతంలో తర్వాతే ఎన్నికలు స్పష్టం చేసిన CEC
డిల్లీ, మార్చి 16 (పీపుల్స్ మోటివేషన్):-
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమయంలోనే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలూ నిర్వహించవచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎదురైన ప్రశ్నకు ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ బదులిస్తూ.. లోక్ సభ పోలింగ్ తర్వాతే అక్కడ ఈ ప్రక్రియ నిర్వహిస్తామని స్పష్టంచేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ ఏకకాలం లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని వెల్లడించారు.
"అక్కడ ప్రతీ అభ్యర్థికి భద్రత అవసరం. దేశవ్యాప్తంగా ఎన్నికల వేళ ఇది సాధ్యం కాదు. మరోవైపు.. జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతంలోని 24 సీట్లు సహా మొత్తం 107 స్థానాల ప్రస్తావన ఉంది. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ నివేదికలో సీట్ల సంఖ్యలో మార్పు వచ్చింది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం” అని సీఈసీ వివరించారు. “స్థానికంగా అన్ని పార్టీలు కూడా పార్లమెంటుతోపాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి. కానీ.. పాలనాయంత్రాంగం మాత్రం ఏకకాలంలో నిర్వహించలేమని చెప్పింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 10, 12 మంది చొప్పున.. మొత్తం వెయ్యి మందికిపైగా అభ్యర్థులు ఉంటారు. ప్రతీఒక్కరికీ భద్రత అందించాలి. ప్రస్తుతం అది సాధ్యం కాదు” అని తెలిపారు. అయితే.. లోక్సభ పోలింగ్ ముగిసిన వెంటనే అక్కడ పోలింగ్ నిర్వహించే విషయానికి కట్టుబడి ఉన్నామని సీఈసీ చెప్పారు.
2024 సెప్టెంబరు 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించేలా ఈసీ చర్యలు...
జమ్మూకశ్మీర్ లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈసీనే నిర్ణయం తీసుకుంటుందని గతంలో కేంద్రం సైతం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే.. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు గతేడాది డిసెంబరులో ఆదేశించింది. 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఈసీ చర్యలు చేపట్టాలని సూచించింది.