శ్రామిక శక్తిని క్యాష్ చేసుకుంటున్న పారిశ్రామికవేత్తలు
శ్రామిక శక్తిని క్యాష్ చేసుకుంటున్న పారిశ్రామికవేత్తలు
ఏటేటా మేడేలు జరుపుకుంటున్నా మారని బతుకులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30 (పీపుల్స్ మోటివేషన్):-
ఏటేటా కార్మిక దినోత్సవాలు జరుపుకుంటూ,, మేడే ఉత్సవాలు నిర్వహిస్తున్నా కార్మిక రంగం మాత్రం పురోగతి సాధించడం లేదు. కార్మికుల శ్రమశక్తితో ఎదుగుతున్న వారు వారిని పట్టించుకోవడం లేదు. గతం కన్నా మిన్నగా శ్రమదోపిడీ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ కానవస్తోంది. యాంత్రికయుగం రాకముందు మనిషి గంటలకొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏవిధంగా పెరిగిం దో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పనిగంటల పోరాటం వచ్చింది. కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే, కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్లో 1862లో సమ్మెచేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు. కాగా, అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1923లో మొదటిసారి భారతదేశంలో 'మే డే'ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి 'మే డే'ను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు. ముఖ్యంగా, ఐ.టి.రంగంలో ఎంతోమంది ఆడపిల్లలు, యువకులు పనిచేస్తున్నారు. ఈనాడు మార్కెట్ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం వుంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు. అమెరికాలో వున్న కంపెనీలు అక్కడ ప్రజాచైతన్యం ఉన్నది కాబట్టి కార్మిక చట్టాలు అమలుకానటువంటి ఇండియాలో కంపెనీలు పెడుతూ వాళ్ళచే 10,12 గంటలు పనిచేయిస్తున్నారు. మాదాపూర్లోని హైటెక్ సిటీలో విద్యావంతులైన యువత ఈనాడు శ్రమ దోపిడీకి బలవుతున్నది. రాత్రుళ్లు ఆడపిల్లలను భద్రతలేకుండా ఇళ్ళకు పంపించడం మూలంగా నేరాల సంఖ్య కూడా పెరుగుతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ వున్నంతవరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. కార్మిక చట్టాలను ఐ.టి. రంగంలో కూడా అమలుకై పోరాటం ఈనాడు అత్యంత అవసరం. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలకవర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయి. అసంఘటితరంగంలో అయితే సరేసరి. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్టు, పార్టెం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టిన ఔట్ సోర్సింగ్లోను కార్మిక చట్టాల నియమాలు అమలులో లేవు. నిరుద్యోగాన్ని, బలహీనతలను ఆసరా చేసుకొని వాళ్ళచే 10,12 గంటలు పనిచేయిస్తున్నారు. ఇది విద్యా, వైద్య రంగాల్లో ప్రయివేటీకరణ పెరిగిన కొద్దీ సర్వీసు భద్రత తక్కువవుతుంది కాబట్టి శ్రమదోపిడీ కూడా పెరుగుతుంది. వెనుకటికి స్కూ ళ్ళు 10 నుండి 14గంటల వరకు పనిచేసేవి. పిల్లవాణ్ణి ఆరు గంటల కంటే ఎక్కువ చది వించకూడదని విద్యావేత్తలు, పరిశోధకులు చెబుతున్నా, సెమీ రెసిడెన్షియల్, రెసిడె న్షియల్ పేర పాఠశాలలు సర్వసాధారణమైపోయాయి. ఆ టీచర్స్ నోరు మెదపకుండా 12 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, పెట్టుబడి దారులు, బహుళజాతి కంపెనీలు, మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మికవర్గం ఆ శక్తు లను ప్రతిఘటించేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి. ప్రపంచ శాంతిని అసలు ఈ భూగోళాన్నే కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకు కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం కూడా ఇదే.