AP: తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు
AP: తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
తెలుగుదేశం ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. గతంలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఏడాదిగా పేదలకు కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. దీంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈనెల 12న ముఖ్యమంతిగా నారా
చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ చేయడం లేదన్న విషయం ఆయన దృష్టికి వెళ్లింది. సత్వరమే సరఫరా చేయాలని ఆదేశించడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు కదిలారు.
రాష్ట్రస్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపించారు. ఈనెల 20 నుంచి రేషన్ షాపులకు బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు, పంచదారను సరఫరా చేయాల్సి ఉంది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లోకి వచ్చిన చక్కెర, కందిపప్పు నాణ్యతతోపాటు అక్కడికి చేరిన ప్యాకెట్లను తూకం వేసి పరిశీలించారు. వచ్చే నెల 1 నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు.