డయేరియా వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టండి
డయేరియా వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టండి
వేడి చేసి చల్లార్చిన నీరే త్రాగాలి..
భోజనం చేసే ముందు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి..
ఆర్డబ్ల్యూఎస్ శాఖ తరచూ నీటి పరీక్షలు నిర్వహించాలి..
జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
కర్నూలు, జూన్ 22 (పీపుల్స్ మోటివేషన్):-
డయేరియా వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, అందులో ముఖ్యంగా త్రాగే నీరు వేడి చేసుకొని చల్లారిన తరువాత త్రాగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన వైద్యాధికారులు, సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డయేరియా నివారణలో (స్టాప్ డయేరియా క్యాంపెయిన్) భాగంగా వైద్యాధికారులు, సంబంధిత శాఖ అధికారులతో జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు డయేరియాకు సంబంధించిన ఎటువంటి కేసులు నమోదు కానప్పటికీ మే మొదటి వారం నుంచి వర్షాలు పడుతున్నందున, వర్షాల వల్ల డయేరియా, డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకుగాను డయేరియాతో పాటు డెంగ్యూ, మలేరియా సోకిన వ్యక్తులకు అవసరమైన వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డయేరియా వ్యాప్తి చెందినప్పుడు మాత్రమే వైద్య సిబ్బంది వైద్య సహాయం చేసే అవకాశం ఉంటుందని, అలా కాకుండా డయేరియాను ప్రబలకుండా ఉండేదుకు ముందుగా మున్సిపల్, డిపిఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కలిసికట్టుగా కృషి చేస్తూ ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ వారు వాటర్ సోర్సెస్ పై దృష్టి సారించడంతో పాటు ఎప్పటికప్పుడు నీటి నమూనాలను పరీక్షలకు పంపుతూ ఉండాలన్నారు. డయేరియాపై పూర్తి స్థాయి అవగాహన ప్రజలకు కల్పించాలన్నారు.
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలల్లో త్రాగు నీరు వేడి చేసుకొని చల్లారిన తర్వాత త్రాగమని చెప్పడంతో పాటు భోజనం చేసే ముందు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని విద్యార్థులకు, చిన్నారులు, అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలలో ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్స్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. త్రాగు నీరు నమూనాలను పరీక్ష శాతం పెంచడంతో పాటు నీటిని క్లోరినేషన్ డ్రైవ్ ను కూడా ఈ వారంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. సామాజిక సంఘటనలైన జాతరలు, ఉత్సవాలు, పెళ్లిళ్లలో కూడా శుభ్రమైన త్రాగు నీరు, భోజనం తీసుకునేలా ఫుడ్ ఇన్స్పెక్టర్లు, పంచాయతీ సెక్రటరీలు తనిఖీ చేసేలా ఆదేశాలు జారీ చెయ్యాలని డిపిఓను కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి మండలంలో కూడా డయేరియా నివారణకు గాను సంబంధిత శాఖల సిబ్బందిని నియమించి జిల్లా స్థాయిలో స్టీరింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించి సదరు ఆదేశాలు/నిర్ణయాలను కూడా మండల స్థాయి సమావేశాల్లో వివరించాలన్నారు. హోటల్స్, డాభాల్లో కూడా శుభ్రమైన త్రాగు నీరు, భోజనం అందించేలా యాజమాన్యాలకు అవగాహన కల్పించాలన్నారు. డయేరియా వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయిలో అధికారులు కృషి చేయాలన్నారు. అదే విధంగా డెంగ్యూ వ్యాధిని నివారణకు కూడా చర్యలు తీసుకోవడంతో పాటు సదరు దోమలు శుద్ధమైన నీరులోనే ఉంటాయని వాటి నివారణకుగాను మంచి నీటిపై ఎప్పుడు మూతలు ఉంచడంతో పాటు ఇంటి పరిసరాల్లో నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా సచివాలయ సిబ్బంది పరిశీలించి సంబంధిత సిబ్బందితో శుభ్రం చేయించి పరిశుభ్రంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఈ విషయంలో సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించి డయేరియా, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
అంతకుముందు సంబంధిత వైద్య సిబ్బంది డయేరియా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు వివరించారు.
సమావేశంలో డిఎంహెచ్ఓ ప్రవీణ్ కుమార్, నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ రామలింగేశ్వర్, అదనపు డిఎంహెచ్ఓ భాస్కర్, డిఈఓ శామ్యూల్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, ఐసిడిఎస్/బీసి సంక్షేమ అధికారి పిడి వెంకటలక్ష్మి, డిపిఓ నాగరాజు నాయుడు, మలేరియా అధికారి నూకరాజు, డిసిహెచ్ఎస్ మాధవి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ భాస్కర్ రెడ్డి, డెమో ప్రమీలాదేవి, హెచ్ఈఓ శ్రీనివాసులు, డిప్యూటీ డెమో చంద్రశేఖర్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.