IT: ఆ రాష్ట్రంలో మంత్రులూ ఇక ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే..!
IT: ఆ రాష్ట్రంలో మంత్రులూ ఇక ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే..!
మధ్యప్రదేశ్లోని భాజపా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మంత్రులు ఇకపై సొంతంగా ఆదాయపు పన్ను చెల్లించాల్సిందేనని సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తూ వస్తోంది. 1972 నుంచి ఈ నిబంధన అమల్లో ఉంది. మంత్రులకు చెల్లించే జీతం, ఇతర భత్యాలపై రాష్ట్ర ప్రభుత్వమే వారి తరఫున ఆదాయపు పన్ను చెల్లిస్తోంది. ఈ నేపపథ్యంలో దాదాపు 52 ఏళ్ల తర్వాత ఈ నిబంధనకు కేబినెట్ చరమగీతం పాడింది.
కేబినెట్ సమావేశంలో మంత్రి కైలాష్ విజయ వర్గీయ ఈ అంశాన్ని లేవనెత్తగా.. మంత్రులు సొంతంగానే ఆదాయపు పన్ను చెల్లించాలని సీఎం మోహన్ యాదవ్ సూచించారు. ఇందుకు కేబినెట్లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మధ్యప్రదేశ్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంత్రులు, అధికారులు సొంతంగానే విద్యుత్ బిల్లులు చెల్లించాలని అస్సాంలోని హిమంత బిశ్వశర్మ సర్కారు నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే మధ్యప్రదేశ్ సర్కారు నుంచి ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.