Mahila shakti: ఇక మహిళల చేతికే మీసేవ కేంద్రాల నిర్వహణ..ప్రభుత్వం నిర్ణయం
Mahila shakti: ఇక మహిళల చేతికే మీసేవ కేంద్రాల నిర్వహణ..ప్రభుత్వం నిర్ణయం
ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరు ఆపరేటర్లుగా ఇంటర్ చదివిన సభ్యురాళ్ల ఎంపిక ఒక్కో కేంద్రానికి రూ.2.50 లక్షల రుణం ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళాశక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయనుంది. కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగా ఆదేశించింది. పంద్రాగస్టు నాటికి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,525 మీ సేవ కేంద్రాలున్నాయి. వీటిలో మూడు వేల వరకు నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలుండగా.. వేయిన్నర వరకే గ్రామాల్లో ఉన్నాయి. ధ్రువీకరణపత్రాలతోపాటు ఆధార్ సేవలు, దరఖాస్తులు, చెల్లింపులు సహా 150కి పైగా ప్రభుత్వ, 600కు పైగా ప్రైవేటు కార్యకలాపాల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలు, నగరాల్లోని కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళాశక్తి పథకం కింద మీసేవ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
గ్రామైక్య సంఘాల పేరిట..
గ్రామైక్య సంఘాల(విలేజ్ ఆర్గనైజేషన్) పేరిట మహిళా శక్తి మీసేవ కేంద్రాలను(ఎమ్మెస్ ఎమ్మెస్సీ) రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
• కేంద్రం ఏర్పాటుకు రూ.2.50 లక్షల రుణాన్ని స్త్రీనిధి ద్వారా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేస్తుంది. వీటితో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో పేరొందిన కంపెనీల నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, జీపీఎస్, బయోమెట్రిక్ పరికరాలు, కెమెరా, ఇంటర్నెట్ కనెక్షన్ కొనుగోలు చేయాలి. కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఆయా సంఘాలు రుణాన్ని నెలనెలా తిరిగి చెల్లించాలి.
• స్త్రీనిధి, స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, రైతు వేదిక, అంగన్వాడీ కేంద్ర భవనాలు లేదా ఇతర ప్రభుత్వ భవనాలు, వాటి ప్రాంగణాల్లో మీసేవ కేంద్రానికి 10 అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పుతో వసతి కల్పిస్తారు.
• ఆయా సంఘాల్లో ఇంటర్ ఉత్తీర్ణులైన సభ్యురాళ్లను మీ సే ఆపరేటర్లుగా ఎంపిక చేస్తారు. కేంద్రం నిర్వహణ, సేవలపై మీ సేవ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తారు. అనంతరం ఆయా మహిళా సంఘాలతో మీసేవ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంటుంది.
• ఈ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన రుసుముల మేరకు పారదర్శకమైన సేవలందిస్తారు. మీ సేవ అధికారులు ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాలను పరిశీలించి వాటి నిర్వహణకు పర్యవేక్షిస్తారు.
ఈ నెలాఖరు వరకు ఆపరేటర్ల ఎంపిక అనంతరం వారికి నెలరోజులపాటు శిక్షణ ఇచ్చి మౌలిక వసతులు కల్పించిన అనంతరం ఆగస్టు 15 నాటికి వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.