Skill Training: విద్యార్థులు, యువతకు అవకాశాలు..
విద్యార్థులు, యువతకు అవకాశాలు..
అవసరమైన మేరకు స్కిల్ శిక్షణ విద్యార్థులతో చంద్రబాబు
అమరావతి, జూన్ 14(పీపుల్స్ మోటివేషన్):
మన విద్యార్థులు, యువత కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అన్వేషించాలని భావిస్తున్నాం. ఇంట్లో ఉంటూ పనిచేసుకునే రిమోట్ ఉద్యోగాలు అందుబాటులో ఉంటే చదువుకుంటూనే పనిచేసుకునే వీలుంటుంది. దీనికోసం మండల కేంద్రాలు, పట్టణాల్లో కొన్ని రిమోట్ వర్క్స్టేషన్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇంట్లో,. లేదా అక్కడికి వెళ్లి పనిచేసుకోవచ్చు. ఉద్యోగవకాశాలు పెంచడమే మా మొదటి లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నైపుణ్యగణన దస్త్రంపై సంతకం చేసిన తర్వాత ఆయన.... తద్వారా లబ్దిపొందే విద్యార్థులు, యువతతో కాసేపు ముచ్చటించారు. అందరికీ బటీ అంటే ఆసక్తి ఉండదు. హోటల్ మేనేజ్మెంట్, ఫిల్మ్ మేకింగ్ వంటి ఇతర రంగాల్లోనూ అవకాశాలు అందుకునేలా యువతను ప్రోత్సహించాలని కొందరు కోరారు. ఇది చాలా మంచి ఆలోచన. ఉదాహరణకు పవన్కల్యాణ్కు ఆయన అన్నయ్య చిరంజీవి కొంత నటన నేర్పించారు. దాన్ని అందిపుచ్చుకుని ఆయన స్వయంకృషితో పైకి ఎదిగారు. అందరికీ అలాంటి ఆసరా లభించదు. ప్రభుత్వంగా మేము ఆ బాధ్యత తీసుకుంటాం. అవకాశాలు బాగుండే రంగంలో నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం. విదేశాల్లో నర్సు ఉద్యోగాలకు డిమాండు ఉంది. అలాంటి రంగాల్లో ప్రోత్సహిస్తాం అని సిఎం అన్నారు. యువత స్టార్టప్లు పెట్టుకోవడానికి ప్రభుత్వం సాయం చేయాలన్నారు. యువతకు సరైన శిక్షణ, చేయూత లభించకపోవడం వల్లే స్టార్టప్లు విఫలమయ్యాయి. ఈ సమస్యల్ని అధిగమించేలా ప్రణాళిక రూపొందించి సాయం అందిస్తాం. నాణ్యమైన విద్య లభించేలా రాష్ట్రమంతటా ఇంజినీరింగ్ కళాశాలలు పెంచాం. దాన్ని అందిపుచ్చుకుని మనవాళ్లు ప్రపంచమంతటా విస్తరించారు. తెదేపా ప్రభుత్వం వల్ల వారికి మంచి జరిగిందని భావించి సొంత డబ్బులు పెట్టుకుని ఏపీకి వచ్చి ఓట్లు వేశారు. దాన్ని నేను ఎప్పటికీ మరిచిపోనని చంద్రబాబు అన్నారు.