సముద్ర అలల తాకిడికి అడ్డుగట్టు వేసేది ఎప్పుడు..?
సముద్ర అలల తాకిడికి అడ్డుగట్టు వేసేది ఎప్పుడు..?
- పూర్తిగా శిధిలమైన జియో ట్యూబ్
- భయం గుప్పెట్లో తీర ప్రాంత ప్రజలు
- ఉప్పాడ బీచ్ రోడ్డు కనుమరుగయ్యే పరిస్థితి
- ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే తీర ప్రాంతం జలమయం తప్పదు
యు కొత్తపల్లి/ పిఠాపురం, (పీపుల్స్ మోటివేషన్):-
ఒక ఉప్పెన కొన్ని గ్రామాలను మింగేస్తుంది.. ఒక సునామీ ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగుల్చుతుంది.. ఒక తుఫాను మర్చిపోలేని విషాదాన్ని నింపుతుంది.. ఒక్కసారి సముద్రం ఉగ్రరూపం దాల్చితే వందల జీవితాలు ఛిద్రమవ్వాల్సిందే.. అయితే ఓ ప్రాంతానికి ఉప్పెనలు, సునామీలు, తుఫాన్లు కొత్తకాదు.. ఐదారేళ్లకోసారి ఓ విలయం వారి జీవితాలపై తాండవం చేస్తూనే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు ప్రకృతి భీభత్సాల్ని దిగమింగుకుని తమకుతాము ధైర్యం చెప్పుకుంటూ గత రెండు దశాబ్దాలుపాటు కాలం సాగిస్తుంటారు. ఇన్నేళ్లుగా భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తూ గడుపుతున్న తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం సముద్ర తీర ప్రాంత గ్రామవాసులు గత కొన్ని ఏళ్లలో కోత కారణంగా దాదాపుగా 360 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. రెండు వందల ఎకరాల పంట భూములు, సరుగుడు తోటలు సహా ఇల్లు బడులు దేవాలయాలు ప్రభుత్వ అతిథి గృహాలు బంగాళాఖాతం మింగేసింది. ఉప్పాడ సమీపంలోని మరో గ్రామమైన కోనపాపపేటలోనూ గత పదేళ్లుగా 20 ఎకరాల పైగా భూమి సముద్రంలో కలిసిపోయింది. ఇళ్లు కోతకు గురయ్యాయి. తుఫాను వచ్చినప్పుడల్లా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం కోతకు గురవుతోంది.
కాకినాడ బీచ్ రోడ్డు 1978 నిర్మించారు..
కాకినాడ నుంచి తుని వరకు గల తీరప్రాంతాన్ని కలుపుతూ 1978లో నిర్మించిన బీచ్ రోడ్డు ఇప్పటివరకు 34 సార్లు కోతకు గురైంది. 6 సార్లు రోడ్డు మొత్తం కొట్టుకుపోతుండగా పక్కనే కొత్తరోడ్డు నిర్మిస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాన్లు వస్తే జిల్లా కేంద్రంలోని కాకినాడ పరిసర ప్రాంతాలు వణికిపోతుంటాయి. దశాబ్దాలకాలంగా సముద్రపు కోతతో అత్యతం విలువైన వందల ఎకరాల భూములు సముద్ర గర్భంలో కరిగిపోతుండగా కోట్లాది రూపాయల విలువైన ఇళ్లు, ఆస్తులు సముద్రపు కెరటాల తాకిడికి కొట్టుకుపోతున్నాయి.
తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ప్రతిపక్షనేత హోదాలో ప్రజాసంకల్పయాత్రలో తీరప్రాంత ప్రజలకు సముద్రం ముందుకు రాకుండా జియో ట్యూబ్ నిర్మాణానికి హామీ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా 30 కోట్ల రూపాయలు కేటాయించి నా వైసిపి ప్రభుత్వం దానిని అమలు చేయలేదు. గత ప్రభుత్వంలో సముద్రపు కోత సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. దాంతో కేంద్రం నుండి వచ్చిన బృందం తీరప్రాంతాన్ని పరిశీలించారు అయినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మొన్న కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పిఠాపురం ఎమ్మెల్యే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీర ప్రాంతాన్ని పరిశీలించి సముద్రం ముందుకు రాకుండా చర్యలు చేపడతామని తెలిపారు.
ముప్పు పొంచి ఉందని గతంలో తెలియజేసిన అధికారులు..
అసలు ఉప్పాడకు సముద్రపు కోతవల్ల ముప్పు ఉందని 1950లోనే అధికారులు గుర్తించారు. సరైన చర్యలు తీసుకోకపోతే మూల్యం తప్పదని ఏయూ శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. 1971లో అప్పటి రాష్ట్రప్రభుత్వం గుర్తించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గోదావరి నుంచి భారీ స్థాయిలో ఇసుక కొట్టుకువస్తుండడంతో కాకినాడ సమీపంలో ఏర్పడిన హోప్ ఐ లాండ్ కారణంగానే ఉప్పాడ కోతకు గురవుతోంది. అలల తాకిడితో హోప్ ఐలాండ్‌లో ఇసుకదిబ్బలు పెరిగిపోయి ఉప్పాడ తీరంలో ఇసుక మేటలు వేయడానికి బదులు మట్టికోతకు గురవుతోందని తేల్చారు. ఇలా కోతకు గురవుతున్న ప్రాంతంలో ఏటా 1.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తెచ్చి తీరంలో వేయాలని బీచ్ ఎరోజన్ బోర్డు సిఫారసు చేసింది. దానిద్వారా అలల తాకిడికి ఇసుకకోతకు గురవుతూ, మళ్లీ ఇసుక మేటలు వేస్తుందని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం సముద్రం ముందుకు రాకుండా 2008లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉప్పాడ సముద్రపు కోత నివారణకు రూ.12కోట్లతో జియోట్యూబ్ టెక్నాలజీతో సేఫ్ వాల్ నిర్మించారు. అయితే ఈ గోడ నిర్వహణను తర్వాతి పాలకులు పట్టించుకోలేదు. దాంతో వాల్ శిథిలమై కోత మళ్లీ ప్రారంభమైంది. తాజాగా ప్రభుత్వం మళ్లీ తీర ప్రాంత రక్షణపై దృష్టి పెట్టింది. అయితే గతంతో పోల్చితే సముద్రపు కోతను నివారించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. జియోట్యూబ్ టెక్నాలజీ అనేది శాశ్వత పరిష్కారం కాదని, మరిన్ని కొత్త టెక్నాలజీల ద్వారా సముద్రపు కెరటాలను ఒడ్డుకు చేరేలోపే నిర్వీర్యం చేయొచ్చని, ముఖ్యంగా కెరటాల ఉధృతిని భారీగా తగ్గించడం ద్వారా తీరప్రాంతం కోతకు గురి కాకుండా చేసేందుకు పలు రాష్ట్రాల్లో కొత్త టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.. ప్రస్తుత ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి తమ ప్రాంతాన్ని కాపాడాలని తీర ప్రాంత వాసులు కోరుతున్నారు. తుఫాన్లు వస్తుంటే తీర ప్రాంత ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. కెరటాల తాకిడికి సముద్రపు నీరు ఇళ్లల్లోకి రావడం ఈ టైం కి ఏమి జరుగుతుందని వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని వేల గృహాలు నేలమట్టం అయ్యాయి. రోజురోజుకీ సముద్రం ముందుకు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం త్వరగా సముద్రం ముందుకు రాకుండా అడ్డుగోట్టు వేయాలని లేనిచో రాబోయే రోజుల్లో భారీ నష్టం జరగవచ్చుని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే భారీ నష్టం జరిగిందని గత ప్రభుత్వాలు ఈ సమస్యను పట్టించుకోలేదని. పట్టించుకున్నట్లయితే ఇంత నష్టం జరగకపోవచ్చనని. తుఫాన్ తాకిడికి బీచ్ రోడ్డు పూర్తిగా దెబ్బతింటుందని సముద్రం కెరటాలు రోడ్డుపైకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని త్వరగా ఈ సమస్య తీర్చాలని వాహనదారులు కోరుతున్నారు.