MPDO: ఆచూకీ లేని నరసాపురం ఎంపిడివో
MPDO: ఆచూకీ లేని నరసాపురం ఎంపిడివో
ముమ్మరంగా గాలింపు చేపట్టిన పోలీసులు
సూసైడ్ నోట్ పంపడంపై కుటుంబ సభ్యుల ఆందోళన
భీమవరం, జూలై 17 (పీపుల్స్ మోటివేషన్):-
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణరావు అదృశ్యంపై కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈనెల 15న రాత్రి 10గంటలకు అదృశ్యమైన ఆయన వివరాలు నేటి వరకూ తెలియకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటరమణరావు అదృశ్యంపై ఇప్పటికే పెనమలూరు పోలీస్ స్టేషన్లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. సంఘటనపై నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సైతం స్పందించారు. ఎంపీడీవో వెంకరమణరావు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. నరసాపురం మాదవాయిపాలెం రేవుపాట వ్యవహారమే ఆయన వెళ్లిపోవడానికి కారణంగా భావిస్తున్నాం. ఆయన విషయంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే రేపు పాటదారుడు చినరెడ్డప్ప ధవేజీ, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, జేఏసీ సభ్యులుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఫెర్రీ కాంట్రాక్టర్ రూ.54లక్షలు బకాయి ఉండడంతో అధికారులు ఆయనపై ఒత్తిడి తెచ్చారు. దీని వల్లే ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. బాధితుడి కుటుంబానికి ఎన్డీయే ప్రభుత్వం అండగా ఉంటుంది. సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా' అని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చెప్పారు. ఈనెల 15న రాత్రి మచిలీపట్నం రైల్వేస్టేషన్ వద్ద ద్విచక్రవాహనం ఉంచి ఎంపీడీవో వెంకటరమణరావు టికెట్ తీసుకుని రైలు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ లభ్యమైనట్లు చెప్పారు. అనంతరం ఆయన విజయవాడ మధురానగర్ వద్ద రైలు దిగినట్లు తెలిపారు. ఎంపీడీవో ఫోన్ సిగ్నల్ ముత్యాలంపాడు వరకు వచ్చి ఆగిపోయినట్లు పేర్కొన్నారు. సమీపంలోనే ఏలూరు కాలువ ఉండడంతో అనుమానంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పుకొచ్చారు. అయితే 16వ తేదీన 'ఈ రోజు నా పుట్టిన రోజు. నేను చనిపోయే రోజు కూడా' అదే అంటూ ఆయన కుటుంబ సభ్యులకు సెల్ఫోన్లో పంపిన మెసేజ్తో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అయితే దీనిపై స్పందించేందుకు మాత్రం బాధితులు ఇష్టపడలేదు. పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినందున, వారి నుంచే సమాచారం తీసుకోవాలని మీడియాకు చెప్పారు. తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు కుటుంబసభ్యులకు ఎంపీడీవో వాట్సాప్లో నోట్ పంపారు. మాజీ విప్ ప్రసాదరాజు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోటింగ్ కాంట్రాక్టర్ను రూ.55 లక్షలు ఫెర్రీ లీజు బకాయిలు చెల్లించాలని అడిగితే బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. గత చీఫ్ విప్ ప్రసాదరాజు అండదండలతోనే వారు డబ్బులు చెల్లించలేదని, గత మూడున్నర నెలల నుంచి నిందితులు తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పూ చేయకపోయినా మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బకాయిలు రికవరీ చేయకపోవడం వల్ల తనను బాధ్యుడిని చేసే అవకాశం ఉందని, తనకు ఉద్యోగమే జీవనాధారం అంటూ బాధను వెల్లగక్కారు. నిందితులు బకాయి డబ్బు చెల్లించేలా చూసి న్యాయం చేయాలంటూ ఆయన లేఖలో కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటరమణరావు విజయవాడ సమీపం కానూరు మహదేవపురం కాలనీలో ఉంటున్నారు. నరసాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన ఈనెల 10నుంచి 20వరకు సెలవులు పెట్టి సొంతూరు వచ్చారు. ఈనెల 15న మచిలీపట్నం వెళ్తున్నానంటూ కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి 10గంటలకు వారికి ఫోన్ చేసి తాను ఇవాళ రావడం కుదరదంటూ చెప్పారు. దాని తర్వాత ఆయన ఎటు వెళ్లారో ఎవరికీ తెలియలేదు. అయితే దానికి ముందు అర్ధరాత్రి సమయంలో 16వ తేదీ తన పుట్టిన రోజని, అదే రోజు తాను చనిపోతున్నట్లు మెసేజ్ చేశారు. ఆందోళన చెందవద్దని కుటుంబసభ్యులకు చెప్పారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన వారు మంగళవారం రోజున పెనమలూరు పోలీసులకు ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎంపీడీవో వాహనాన్ని మచిలీపట్నం రైల్వేస్టేషన్ వద్ద గుర్తించారు. ఆయన ఫోన్ పనిచేయకపోవడంతో విజయవాడ, మచిలీపట్నంలో గాలింపు చర్యలు చేపట్టారు.