UK Prime Minister Salary: యూకేకు ప్రధాని జీతం ఎంతో తెలుసా..!
UK Prime Minister Salary: యూకేకు ప్రధాని జీతం ఎంతో తెలుసా..!
తాజా ఎన్నికల్లో కన్జర్వేటర్ పార్టీ చిత్తు
410 స్థానాలతో ఏకపక్ష విజయం సాధించిన లేబర్ పార్టీ
కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న కీర్ స్టార్మెర్
వార్షిక వేతనం రూ. 1.8 కోట్లు మాత్రమే
ఇతర వృత్తులతో పోలిస్తే చాలా తక్కువ
యూకేలో తాజాగా జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు గాను 410 సీట్లతో ఘన విజయం సాధించి 14 ఏళ్ల టోరీల (కన్జర్వేటివ్ పార్టీ) పాలనకు చరమగీతం పాడింది. 1997లో టోనీ బ్లెయిర్ సాధించిన విజయం తర్వాత మళ్ల అంతటి భారీ విజయాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ స్థానంలో కీర్ స్టార్మెర్ ప్రధాని కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా కీర్‌కు ఎంత వేతనం, ఇతర ప్రయోజనాలు లభిస్తాయన్న చర్చ మొదలైంది.
యూకే పార్లమెంట్ ప్రకారం.. ప్రధానికి 172,153 పౌండ్ల (రూ. 1.8 కోట్లు) వార్షిక వేతనం లభిస్తుంది. ఇందులో ప్రధానిగా 80,807 పౌండ్లు, ఎంపీగా 91,346 పౌండ్లు లభిస్తాయి. అయితే, ఈ మొత్తంలో 75,440 పౌండ్లు క్లెయిమ్ అవుతాయి. హౌస్ ఆఫ్ కామన్స్ వెబ్‌సైట్ ప్రకారం దేశంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా ఎంపీలు పన్ను, బీమా చెల్లిస్తారు.
నిజానికి యూకే ప్రధానిగా పనిచేసే వ్యక్తికి ఇతర వృత్తులతో పోలిస్తే మంచి వేతనం ఏమీ లభించదు. బీబీసీ న్యూస్ నివేదిక ప్రకారం గతంలో ప్రధానులుగా చేసినవారు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కాబట్టి రాచరికం నుంచి బెయిల్ అవుట్ అవసరమని పేర్కొన్నారు.
నిజం చెప్పాలంటే శతాబ్దాలుగా యూకే ప్రధానుల జీవన ప్రమాణాలు గణనీయంగా పడిపోయినట్టు ‘ఇండిపెండెంట్’ నివేదిక పేర్కొంది. 18వ శతాబ్దంలో విలియం పిట్ ట్రెజరీ మొదటి ప్రధానిగా ఏడాదికి 10,500 పౌండ్లు అందుకున్నారు. 20వ శాతాబ్దం ప్రారంభంలో మార్క్వెస్ ఆఫ్ సాలిస్బరీ ఏడాదికి 5 వేల పౌండ్లు మాత్రమే వేతనం తీసుకునేవారు. 1937లో ప్రధాని వార్షిక వేతనం 6 లక్షల పౌండ్లకు పెరిగింది.
మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ రాజీనామా తర్వాత స్థాపించిన పబ్లిక్ డ్యూటీ కాస్ట్స్ అలవెన్స్ (పీడీసీఏ)ఏడాదికి 1,15,000 పౌండ్ల వరకు క్లెయిమ్ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ ఖర్చులు జీవితాంతం క్లెయిమ్ చేసుకోవచ్చు.