Chicken: ప్రతి రోజూ చికెన్ తింటున్నారా?
Chicken: ప్రతి రోజూ చికెన్ తింటున్నారా?
నాన్ వెజ్ తినేవారిలో చాలా మంది చికెన్ (కోడి మాంసం)ను చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్-65 ఇలా చెప్పుకుంటూ పోతే కోడి మాంసంతో తయారు చేసే వంటకాల లిస్ట్ చాలానే ఉంటుంది. నాన్ వెజ్ ప్రియుల్లో కొందరు వారంలో 3, 4 సార్లు చికెన్ తింటే.. మరి కొందరు వారంలో ఒకటి, రెండు సార్లైనా తింటారు. కొందరికైతే రోజూ చికెన్ లేకుంటే ముద్ద దిగదు. అయితే చికెన్ కు సంబంధించి అమెరికాకు చెందిన ఓహియో స్టేట్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ సైన్సెస్ నిర్వహించిన అధ్యయనంలో చికెన్ ప్రియులకు షాకిచ్చే విషయాలు వెల్లడయ్యాయి. వారానికి ఒకటి, రెండు సార్లు చికెన్ మితంగా తింటే మనకు కావాల్సిన పోషకాలు అందుతాయని.. కానీ ప్రతి రోజూ చికెన్ తింటే మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది.
ఓహియో స్టేట్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ సైన్సెస్ 35 వేల మంది అమెరికన్ల ఆహారపు అలవాట్లపై పరిశోధనలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించింది. చికెన్ ప్రతిరోజూ తినడం మంచిది కాదని.. వారంలో ఒకటి లేదా రెండు సార్లు వంద గ్రాములకు (ఒక్కరికి) మించకుండా తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది. చికెన్ ఎక్కువగా తినేవారిలో మధుమేహం, రక్తనాలాల్లో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది.
చికెన్ ఎక్కువగా తింటే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..
చికెన్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదని.. దీనిలో లభించే ప్రొటీన్ మనకు ఎంతో అవసరమని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే అధికంగా తింటే మాత్రం హాని తప్పదని వెల్లడించారు. అతిగా తింటే శరీరంలో హానికర కొలెస్ట్రాల్ పెరిగిపోయి.. గుండె సమస్యలు, హైపర్టెన్షన్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే.. చికెన్ తక్కువగా తీసుకుంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ చికెన్ తింటే.. త్వరగా బరువు పెరుగుతాము. చికెన్ ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తినడం వల్ల శరీరం బర్న్ చేయలేని అదనపు ప్రొటీన్లు.. కొవ్వు రూపంలో శరీరంలో నిల్వ ఉండిపోతాయి. దీనివల్ల త్వరగా బరువు పెరుగుతారు. చికెన్ ఎక్కువగా తింటే.. మూత్రనాళ ఇన్ఫెక్షన్తో సహా మరికొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. యూరిక్ యాసిడ్ సమస్య వచ్చే ప్రమాదం ఉందని అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో యూరిక్ యాసిడ్ ఒకటి. ఇది మూత్రం ద్వారా బయటకుపోతుంది. ఒకవేళ యూరిక్ యాసిడ్ విసర్జన సరిగా జరగకపోతే రక్తంలోనే నిలిచిపోయి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
అందుకే చికెన్ అంటే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ వారంలో 2 లేదా 3 సార్లుకు మించి తీసుకోకపోవడం మంచిది. అదీ ఎక్కువ పరిమాణంలో కాకుండా మితంగానే తినాలి. అప్పుడే దాని ప్రయోజనాలు శరీరానికి చక్కగా అందుతాయి. ప్రతిరోజూ చికెన్ తినే అలవాటు ఉంటే మానుకోవడం మంచిది. ఇది ఆరోగ్యానికి చేసే మేలు కంటే నష్టమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.