One Nation-One Election: అసలు 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అంటే ఏంటి? పూర్తి సమాచారం?
One Nation-One Election: అసలు 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అంటే ఏంటి? పూర్తి సమాచారం?
>> వన్ నేషన్- వన్ ఎలక్షన్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం...
>> 18,626 పేజీల నివేదికను సమర్పించిన మాజీ రాష్ట్రపతి కమిటీ...
>> వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...
>> మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ ఆధ్వర్యంలో కమిటీ...
>> ఈ బిల్లుకు 14 రాష్ట్రాలు సమర్థించాలి...
>> 1980 లోనే జమిలీ ఎన్నికల ప్రతిపాదన..
వన్ నేషన్, వన్ ఎలక్షన్కి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర మంత్రివర్గం ఈరోజు భేటీ అయింది. ఈ సమావేశంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కాగా.. ఈ బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచింది. ఈ క్రమంలో కేంద్రం ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా.. అసలు ఒకే దేశం- ఒకే ఎన్నిక గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో 8 మంది సభ్యులతో కమిటీ..
భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన ఏకకాల ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో సమావేశమై తన నివేదికను సమర్పించింది. ఈ 18,626 పేజీల నివేదికను తయారు చేసేందుకు కమిటీ ఈ బిల్లుపై కమిటీ విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు, సూచనలను సమర్పించగా, వాటిలో 32 ఏకకాల ఎన్నికలకు మద్దతు ఇచ్చాయి. ఈ విషయమై పలు రాజకీయ పార్టీలు హెచ్ఎల్ఎ్సతో విస్తృతంగా చర్చించాయి. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని వార్తాపత్రికలలో ప్రచురించబడిన పబ్లిక్ నోటీసుకు ప్రతిస్పందనగా, భారతదేశం నలుమూలల నుంచి 21,558 మంది పౌరులు స్పందించారు. ప్రతివాదులు 80 శాతం మంది ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపారు. నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, ప్రధాన హైకోర్టులకు చెందిన పన్నెండు మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు, నలుగురు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, ఎనిమిది మంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, భారత లా కమిషన్ ఛైర్మన్ వంటి న్యాయ నిపుణులను కమిటీ వ్యక్తిగతంగా పరస్పర చర్చ కోసం ఆహ్వానించింది. భారత ఎన్నికల సంఘం అభిప్రాయాలను కూడా కోరింది. ఇదిలా ఉండగా..
అసలు 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అంటే ఏంటి?
ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం లేదా దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడమే జమిలీ ఎన్నికలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీలతోపాటు లోక్సభకు కూడా ఒకే సమయంలో ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా అదే నిజమైంది. అయితే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అమల్లోకి తీసుకురావడం అంత తేలికైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ సవరణలకు లోక్సభలోని 543 స్థానాల్లో కనీసం 67 శాతం మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. అటు రాజ్యసభలోని 245 సీట్లలో 67 శాతం ఈ బిల్లును సమర్థించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.
దేశంలో సగం రాష్ట్రాలు సమర్థించాలి..
ఈ బిల్లును సమర్థిస్తూ రాష్ట్రాలు తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ బిల్లును ఎన్నికల బిల్లుగా ఆమోదం పొందాలంటే 14 రాష్ట్రాలు ఆమోదించాలి అయితే ప్రస్తుతం దేశంలోని 10 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఆరు రాష్ట్రాల్లో ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. లోక్సభలో ఎన్డీఏ కూటమికి దాదాపు 333 సీట్ల బలం ఉంది. మొత్తం లోక్సభ స్థానాలు543. ఇందులో ఎన్డీఏకు 333 సీట్లు అంటే 61శాతానికి సమానం. అయితే ఇప్పుడు బీజేపీకి మరో 6 శాతం ఓటింగ్ అదనంగా అవసరం. ఈ ఆరు శాతం ఓటింగ్ ఎన్డీఏ కూటమికి కష్టమని పలువులు అభిప్రాయపడుతున్నారు. ఇక అటు రాజ్యసభలో కేవలం 38 శాతం సీట్లు మాత్రమే ఎన్డీఏకు ఉండటంతో అసలు ఈ జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలేం జరుగుతుందో చూడాలంటే సమావేశాలు ప్రారంభం కావాల్సిందే.
అప్పటి ప్రతిపాదన...
జమిలీ ఎన్నికల ప్రతిపాదన 1980లో వచ్చింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ మే 1999లో తన 170వ నివేదికలో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. అందుకు తగినట్లే కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధ్యయనానికి కమిటీ వేసి.. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుంది.
అసలు జమిలీ ఎన్నిక అవసరం ఉందా?
రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చులు చేస్తోంది. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' విధానాన్ని అమలు చేసేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తోంది. దీని వల్ల ఎలాంటి లాభం ఉంటుందో చూద్దాం.. వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్లే భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇలా ప్రజా ధనం వృథా అవుతోందని దాన్ని అరికట్టేందుకే జమిలీ ఎన్నికలను తీసుకురావాల్సిన అవసరం ఉందని బీజేపీ అభిప్రాయపడుతోంది. 2019 లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనాలున్నాయి. అదే సమయంలో ఒక్కో రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్లు ఈసీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రాజకీయ పార్టీలు అనధికారికంగా.. పెట్టే ఖర్చులు చెప్పనవసరం లేదు. 2019 లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు కలిపి దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సహా ఇతర పార్లమెంటరీ ప్రొసీజర్లను కూడా సవరించాల్సి ఉంటుంది. దీని కోసం రాష్ట్రాల అంగీకారం కూడా కావాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల వాదనలు వినాలంటే పార్లమెంట్ సమావేశాల వరకు ఆగాల్సిందే..