Spam Calls: స్పామ్ కాల్స్ బెడద పోవాలంటే?
స్పామ్ కాల్స్ బెడద పోవాలంటే?
రోజురోజుకీ అవాంఛిత స్పామ్ కాల్స్ బెడద ఎక్కువవుతోంది. ప్రచారం, ఫిషింగ్, మాల్వేర్ వ్యాప్తి, మోసాల కోసం పెద్దఎత్తున వీటిని వాడుకుంటారు. అనుకోకుండా వీటికి సమాధానం ఇస్తే మనం అసలు వ్యక్తులమేనని మోసగాళ్లు గుర్తిస్తారు కూడా. మరిన్ని స్పామ్ కాల్స్తో వెంటాడతారు. వీటిని అడ్డుకోవటం కష్టమే. ఎందుకంటే కొత్త నంబర్లతోనూ విసిగిస్తుంటారు. మరి వీటిని అడ్డుకోవటమెలా? ట్రూకాలర్ వంటి యాప్లతో వీటికి అడ్డుకట్ట వేయొచ్చు. ఇప్పుడు చాలాఫోన్లు ఇందుకోసం బిల్టిన్గా ఫీచర్లనూ ప్రవేశ పెడుతున్నాయి.
ఆండ్రాయిడ్ ఫోన్లలో అయితే ఇలా
ఐఫోన్లతో పోలిస్తే ఆండ్రాయిడ్ ఫోన్లలో స్పామ్ కాల్సు అడ్డుకోవటం తేలికే అనుకోవచ్చు. ఇందుకోసం ముందుగా గూగుల్ ఫోన్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అనంతరం దీన్ని ఓపెన్ చేసి సూచనలను అనుసరిస్తూ డిఫాల్ట్ డైలర్గా సెట్ చేసుకోవాలి. తర్వాత యాప్ను తిరిగి తెరవాలి. మెయిన్ స్క్రీన్లో మూడు చుక్కల మెనూను తాకి సెటింగ్స్లోకి వెళ్లి 'కాలర్ ఐడీ అండ్ స్పామ్'ను తాకాలి. ఎనేబుల్ ఫిల్టర్ స్పామ్ కాల్స్ ఆప్షన్ను ఎంచుకోవాలి. దీంతో దానంతటదే అనుమానిత కాల్స్ను అడ్డుకుంటుంది.
ఐఫోన్లోనైతే ఇలా
ఐఫోన్లోనైతే ట్రూకాలర్ వంటి యాప్లను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక సెటింగ్స్ ద్వారా ఫోన్ విభాగంలోకి వెళ్లి కాల్ బ్లాకింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆప్షనన్ను ఎంచుకోవాలి. ఇందులో ఉన్న నాలుగు ఆప్షన్లనూ ఆన్ చేసుకోవాలి. అనంతరం ట్రూకాలర్ యాప్ను ఓపెన్ చేసి స్పామ్ డిటెక్షన్ ఫీచర్ను ఎనేబుల్ చేసుకోవాలి. అయితే ఇది దానంతటదే స్పామ్ కాల్స్ను నిలువరించదు. కానీ డేటాబేస్తో ఫోన్ నంబరును పోల్చి స్పామ్ కాల్ అవునో కాదో తెలియజేస్తుంది.