TG GOVT: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంసెట్, నీట్ కోచింగ్..విద్యా శాఖ ఉత్తర్వులు!
TG GOVT: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంసెట్, నీట్ కోచింగ్..విద్యా శాఖ ఉత్తర్వులు!
రోజూ ప్రత్యేక తరగతులు.. విద్యా శాఖ ఉత్తర్వులు
కోచింగ్‌లో ప్రతీ వారం విద్యార్థులకు ప్రత్యేక టెస్ట్‌లు
ఒకేషనల్ కోర్సుల వారికి నైపుణ్యాలను అభివృద్ధి ప్రత్యేక జాబ్‌మేళాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా ఎంసెట్, నీట్ కోచింగ్ ఇప్పించాలని నిర్ణయించింది. అలాగే ఒకేషనల్ కోర్సులు చదువుతున్న వారి నైపుణ్యాలను అభివృద్ధి పరచి ప్రత్యేక జాబ్‌మేళాలను నిర్వహించనున్నారు. ఈమేరకు శుక్రవారం విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులతో పోటీ పడేలా ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షలను ఎదుర్కోవడానికి వీలుగా రాష్ట్రంలోని 400 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంసెట్, నీట్, జేఈఈ, సీఏ వంటి కోర్సుల కోచింగ్ నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
ప్రతి రోజూ ఇందులో భాగంగా 50 నిమిషాల పాటు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారు. ఇందుకు ఇప్పటికే జూనియర్ లెక్చరర్లకు నిపుణులతో ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు. ఈ కోచింగ్‌లో ప్రతీ వారం విద్యార్థులకు ప్రత్యేక టెస్ట్‌లను కూడా నిర్వహిస్తారు. విద్యార్థులకు అందించడానికి వీలుగా ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను తెలుగు అకాడమీ ద్వారా సిద్ధం చేస్తున్నారు. అంతేగాక ప్రభుత్వ జూనియర్ ఒకేషనల్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యాలను పెంచి, వారికి ఉద్యోగాలు వచ్చేలా చర్యల్ని తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో సుమారు 187 కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి. మొత్తం 22 రకాల కోర్సులను నిర్వహిస్తున్నారు. ఇందులో కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్ వంటి 7 ఇంజనీరింగ్ కోర్సులు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా ఈ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి వీలుగా ప్రత్యేక చర్యల్ని తీసుకోనున్నారు. ముఖ్యంగా ఆయా రంగాల కంపెనీలు, సంస్థలతో అవగాహనఒప్పందాలు చేసుకుని కళాశాలలతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. కోర్సు ముగిసిన తర్వాత ఒక ఏడాది పాటు ఆయా కంపెనీలు, సంస్థల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. అనంతరం జాబ్‌మేళాలను నిర్వహించి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను అమలుపరచడం కోసం ప్రత్యేక అకడమిక్ గైడెన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ సెల్‌లో పనిచేయడం కోసం ముగ్గురు జూనియర్ లెక్చరర్లను డిప్యూటేషన్‌పై నియమించనున్నారు. మరో ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమిస్తారు. ఇక నుంచి రెగ్యులర్‌గా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించడం, దానిని అమలుచేయడం, ఆడిట్‌ను నిర్వహించడం వంటి వాటిపై దృష్టి పెట్టనున్నారు. అలాగే.. ప్రత్యేక యాప్‌ను రూపొందించి కోచింగ్ తరగతులు ఎలా కొనసాగుతున్నాయనే విషయాన్ని ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. కొత్త కోర్సుల్ని ప్రవేశపెట్టడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో బయో మెట్రిక్ హాజరు అమలుపరచనున్నారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.