AP LIQUOR POLICY: దుకాణాలు తక్కువ-దరఖాస్తులు ఎక్కువ.. లాటరీ కొట్టేదెవరో?
AP LIQUOR POLICY: దుకాణాలు తక్కువ-దరఖాస్తులు ఎక్కువ.. లాటరీ కొట్టేదెవరో?
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు..
దరఖాస్తు ఫీజుల ద్వారా ప్రభుత్వానికి 1797.64 కోట్ల ఆదాయం..
దుకాణాలు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ..
16 తేదీ నుంచి నూతన మద్యం విధానం..
క్వార్టర్ బాటిల్ ధర 99 రూపాయలకే విక్రయించేలా సవరణ..
ఈ నెల 16 తేదీ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి 1797.64 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు వెల్లడించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రాగా, వీటిని పునః పరిశీలించాలని ఎక్సైజు శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్, విజయవాడ జిల్లాల్లో అత్యధికంగా 113 దుకాణాలకు 5764 దరఖాస్తులు వచ్చాయి. రేపు జిల్లాల వారీగా లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు ప్రక్రియను ఎక్సైజ్ శాఖ చేపట్టనుంది. లాటరీ అనంతరం ఈ నెల 15 న ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాల అప్పగించనుంది.
దుకాణాలు తక్కువ-దరఖాస్తులు ఎక్కువ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2017 మార్చిలో చివరిసారిగా ప్రైవేటు మద్యం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అప్పట్లో 4,380 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 76 వేల దరఖాస్తులు వచ్చాయి. అంటే సగటున ఒక్కో దుకాణానికి 17 నుంచి 18 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తులతోపాటు రిజిస్ట్రేషన్ రుసుముల రూపంలో అప్పట్లో ఎక్సైజ్ శాఖకు రూ. 474 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సారి 3,396 దుకాణాలకు మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే 2017 కన్నా తక్కువ దుకాణాలకే నోటిఫికేషన్ ఇచ్చినా దరఖాస్తులు మాత్రం ఎక్కువ వచ్చాయి.
క్వార్టర్ బాటిల్ ధర 99 రూపాయలకే..
దేశంలో తయారైన విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరను చిల్లర లేకుండా సర్దుబాటు చేసేలా అదనపు ప్రివిలేజ్ ఫీజును విధించనుంది. క్వార్టర్ బాటిల్ ధర 99 రూపాయలకే విక్రయించేలా సవరణ చేసింది. బాటిల్ ఎమ్మార్పీ ధర 150.50గా ఉంటే దాన్ని 160 రూపాయలకి ప్రివిలేజ్ ఫీజు అదనంగా పెంచింది. క్వార్టర్ బాటిల్ ధర 90.50గా ఉంటే ఏపీఎఫ్ కలిపి దాని ధర 100 రూపాయలు అవుతుందని అధికారులు వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వార్టర్ బాటిల్ ధర 99కే నిర్ధారించినందున 100 ధరలో 1 రూపాయిని మినహాయించి విక్రయిస్తారని స్పష్టం చేసింది.