గ్రామాల అభివృద్ధికి పల్లె పండుగలో పునాదిరాయి
గ్రామాల అభివృద్ధికి పల్లె పండుగలో పునాదిరాయి
రూ.4500 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
కంకిపాడు మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
పెనమలూరు, అక్టోబర్ 14 (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్రవ్యాప్తంగా 'పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు' కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ. 4,500 కోట్ల నిధులతో 30 వేల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండల పరిధిలోని పునాదిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని సి.హెచ్.సి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ప్రారంభించి పనులకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఈ పనులు చేపడతారు. తఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 3 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 25,000 గోకులాలు, 10 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ ట్రెంచులు లాంటివి నిర్మించనున్నారు.
కంకిపాడు, పునాదిపాడు గ్రామాల్లో కొత్త రోడ్లకు శ్రీకారం..
ఈ కార్యక్రమంలో భాగంగా కంకిపాడు మండల పరిధిలోని పలు అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. కంకిపాడు గ్రామంలో రూ.95.15 లక్షల అంచనా వ్యయంతో 11 అంతర్గత సిమెంటు రోడ్ల నిర్మాణం, రూ. 54 లక్షల అంచనా వ్యయంతో పునాదిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కాంపౌండ్ వాల్ నిర్మాణం, అదే గ్రామంలో రూ.52 లక్షల విలువైన రెండు అంతర్గత సిమెంటు రోడ్ల నిర్మాణానికి సంబంధించి శిలాఫలకాలు ప్రారంభించి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, కృష్ణా జిల్లాకు చెందిన శాసనసభ్యులు బోడే ప్రసాద్, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, వెనిగండ్ల రాము, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, డైరెక్టర్ కృష్ణతేజ, కలెక్టర్ డి.కె. బాలాజీ, కంకిపాడు, పునాదిపాడు గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
కంకిపాడులో ఘన స్వాగతం..
అంతకు ముందు పల్లె పండుగ కార్యక్రమ ప్రారంభోత్సవానికి కంకిపాడుకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కి జనసేన శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. రహదారికి ఇరువైపులా ఉన్న భవనాలపై నుంచి వాహన శ్రేణిపై పూల వర్షం కురిపించారు. దారి పొడుగునా పల్లెల అభివృద్ధి ప్రదాత పవన్ కళ్యాణ్ కి జేజేలు అంటూ నినదించారు.