స్త్రీవాదం ఇంట్లోనే.. బయట ప్రపంచంలో కీలు బొమ్మలు.. స్త్రీ సమానత్వం అందని ద్రాక్ష
స్త్రీవాదం ఇంట్లోనే.. బయట ప్రపంచంలో కీలు బొమ్మలు
• స్త్రీ సమానత్వం అందని ద్రాక్ష
• వనితల జనాభా తగ్గితే జగమంతా “పెళ్లి కానీ ప్రసాదు” లే
• ఆడవారికి ఆదివారం కూడా నో రెస్ట్
ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉందనే మాట ఇంటికే పరిమితం. వేళకు పంచభక్ష్య పరమాన్నాలు వండిపెట్టి…ఇస్త్రీ బట్టలు వేసి ఆఫీసు కు పంపి తిరిగి ఇంటికి వచ్చే సరికి నీట్ గా తయారయ్యి మల్లెపూలు పెట్టుకొని టీ కాఫీ అందించడం వల్ల భర్త మానసిక ఉల్లాసం కోసం భార్యలు వంటింటి కుందేళ్ళు అవుతున్నారా? ఇదేనా స్త్రీ స్వేచ్ఛా? సెలవు లేని జీవితం స్త్రీ ది! ఆదివారాలు పొద్దెక్కేదాకా భర్త పడుకోవచ్చు గానీ… ఆ రోజు కూడా పెందలాడే లేచి బిర్యానీ వండి ‘సండే స్పెషల్” లు చేసి ఆదివారం అదనపు పని భారాన్ని మోసే స్త్రీ కి స్వేచ్చ కోరుకునే అధికారం భర్తల నుండి తీసుకోవాలా? తన సంసారాని కాపాడుకుంటూ వంశానికి బాధ్యతగా వంశోద్ధారకులును తయారు చేస్తుంది స్త్రీ తన పుట్టింటి పేరు మార్చుకొని భర్త ఇంటిపేరు పెట్టుకుని వంశాన్ని కాపాడుకుంటుంది అది స్త్రీ మూర్తి అంటే!! ఒక తల్లిగా చెల్లిగా అక్క అత్తగా ఇలా రకరకాల సంబంధాలతో ముడుపడి ఉంటుంది.
ఇంట్లో వితంతువకు పెళ్ళి చేయరు..
ఇంట్లో భార్య బాధితులం అని మొత్తుకుంటున్న కొంత మంది భర్తలు ఇల్లు దాటగానే వేసే వెకిలి వేషాలకు అట్లకాడ తో కాల్చాలి. వేదికలపై రాజా రామమోహనరావు లా మాట్లాడే వారు ఇంట్లో వితంతువు ఉంటే పెళ్లి చేయరు. భారతీయ సంస్కృతిపై ప్రవచనాలు చెప్పే వారు భర్త తో గొడవ పడి వచ్చే అమ్మాయిలకు హిత బోధ చేయరు. పైగా స్వేచ్చ ఇచ్చామని చెబుతారు. ఇదా సంస్కృతి? స్త్రీ గర్భం దాల్చడానికి ముందే అబ్బాయా, అమ్మాయా అనే చర్చ. జీవ సంబంధమైన చర్చ ఒక కుటుంబంలో రావడమే స్త్రీ నీ కట్టడి చేసే ఆలోచన. భారత ప్రభుత్వం ఎన్ని స్త్రీ చట్టాలు తెచ్చినా ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ముఖం పై ముసుగు తీయని మహిళలు ఉత్తర భారత దేశం గ్రామీణ ప్రాంతాల్లో కోకొల్లలు. ఆధునికీకరణ, పాశ్చాత్యీకరణ, పారిశ్రామికీ కరణ, సాంకేతిక పురోగతి ఎంత సాధించినా పట్టణ ,గ్రామీణ వ్యవస్థలో స్త్రీ పాత్ర పరిమితి పెరగలేదు, భారతీయ కుటుంబ వ్యవస్థలో స్త్రీ భ్రూణహత్య, బాల్య వివాహం, వితంతువుల సమస్యలు ఇంకా పట్టి పీడిస్తునే ఉన్నాయి. ఇవ్వాళ భారత రోజు వారీ పుట్టుక పట్టిక తీసుకుంటే ప్రతి వంద మందిలో పురుషులు అరవై మంది స్త్రీలు నలభై మంది పుడుతున్నారు…అంటే స్త్రీ జనాభా కు కట్టడి మొదలైంది! రేపటి తల్లి కూడా పెళ్లి కాగానే తన లాగా అడదిగా పుట్టడం కష్టాలు కోని తెచ్చుకోవడమే అని మగ సంతానానికే మొగ్గు చూపడం వివక్షకు తార్కాణం. మహిళను గౌరవించే గొప్ప సంప్రదాయం గల భారత దేశంలో ఈ వివక్ష వల్ల స్త్రీ సంతానం తగ్గుతుంది. చట్ట సభల్లో భ్రూణహత్యలను అరికట్టాలని చట్టాలు తెస్తే గర్భం లోనే అడ శిశువును హతమార్చే ఎలక్ట్రో పోరేసిస్, ఎరిక్సన్ పద్దతి ద్వారా ఆధునిక టెక్నాలజీ నీ ఉపయోగించడం వల్ల, లింగ నిర్ధారణ గర్భంలోనే మారిపోయే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల అడ జాతి కి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
తగ్గిపోతున్న స్త్రీ జనాభా
ప్రస్తుత భారతీయ దృశ్యం లో స్త్రీ జనాభా రోజు రోజుకు తగ్గుతోంది. వివిధ ప్రాంతాలు, సమాజాలు, సాంస్కృతిక నేపథ్యాలు, పట్టణ-గ్రామీణ ఆవాసాల్లో స్త్రీ జనాభాకు ఆచారాలు అడ్డుపుల్ల అవుతున్నాయి… ప్రజల జీవనశైలిలో తేడాల వల్ల మూఢనమ్మకాల వల్ల మహిళ లే మగ వారసులు కావాలనుకుంటున్నారు. జనాభా లెక్కల ప్రకారం పురుషుడు: స్త్రీ నిష్పత్తి 933: 1000, ఇది ఆందోళనకరమైనది. జీవసంబంధమైన నిబంధనను బట్టి, మిలియన్ల మంది మహిళల జనాభాను తగ్గించే ప్రయత్నం వల్ల భవిష్యత్ లో పెళ్ళికాని ప్రసాద్ లు వాడకు ఇద్దరు తయారు అయేట్టు ఉన్నారు. భారతదేశంలో, అబ్బాయి పుడితే వేడుకలకు సమయం, ఒక అమ్మాయి పుడితే ఏడుపుల సమయమా ? మొదటి సంతానం మగపిల్లవాడు కావాలని కోరుకోవడం తల్లి దండ్రులు చేస్తున్న మొదటి తప్పు. తరువాతి కుమార్తె కోసం ఎదురి చూసే తల్లులు సంక్షోభానికి గురవుతున్నారు. ఎందుకంటే ఆర్థిక స్థోమత అంతంత మాత్రం ఉన్న కుటుంబాల్లో రెండో సంతానంగా పుత్రిక పుట్టడం వల్ల కష్టాలు అనే దురదృష్టకర స్థితిలో నేటి తల్లులు ఉన్నారు. భారతదేశ జనాభాలో మూడొంతుల మంది ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు, ఇక్కడ ఆడపిల్లలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, సాంకేతిక పురోగతి కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఆడశిశువుల భ్రూణహత్యలు ఎక్కువగా ఉన్నట్లు ఒక సర్వే సూచిస్తోంది. రెండు అడ్డంకులు దాటుకొని పెళ్లీడు కొచ్చిన పిల్లను తన్నుకు పోయి హత్యలు చేసే రాబందుల వల్ల దేశంలో ఆడపిల్ల మనుగడ కష్టమవుతుంది.బాల్యం నుండే అడ మగ భేదాలు మన సమాజంలో దండిగా ఉన్నాయి. సమాజంలో ఆడపిల్లల పట్ల పెంపకం లోటుపాట్లు కనబడతాయి…అబ్బాయిని హీరో లాగా, అమ్మాయిని వంట మనిషిగా చూసే దృక్పథం మన భారత దేశంలో ఇక మారదేమో. పిల్లలు పుట్టిన వెంటనే, సమాజం వారిని “ఆమె” లేదా “అతడు” గా గుర్తించి ఆమెగా పెదవి విరుపు కు మొదలవడం వల్ల వివక్ష పురిట్లోనే మొదలవుతుంది. తల్లిదండ్రులు కూడా అడ వారికి బట్టలు, కూడా బొమ్మలను కూడా ఎంచుకునే అప్పుడు వివక్ష చూపిస్తారు… రెండు సంవత్సరాల వయస్సులో, తల్లి దండ్రుల వల్ల ఆడపిల్లలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
ఆడపిల్ల రెండో స్థానంలోనే
మానసిక శాస్త్ర వేత్తలు కూడా చేసిన పరిశోధనల్లో వారసుడు అనే పదం తప్ప వారసురాలు అనే మాట చదువుకున్న వారి నుండి కూడా రావడం లేదు. సామాజిక కోణంలో అడుగడుగునా ఆడపిల్ల రెండో స్థానం లోకి రావడం దురదృష్ట కరం. ప్రపంచ దేశాల్లో సమానత్వం లో మహిళలు వెనుక బడిపోయారనీ కొన్ని దేశాల్లో మాత్రం పురుషులకు సమానంగా ఉద్యోగాలు చేస్తున్నా ఇంట్లో మాత్రం మగ పెత్తనమే రాజ్యమేలుతుందనీ సర్వేలు చెబుతున్నాయి “ఆడపిల్ల చెబితే వినలా?” అనే ధిక్కార ధోరణి వల్ల సియివో స్థాయి ఉన్న వారు కూడా కంపెనీ వ్యవహారాల్లో మగవారిపై ఆధార పడుతున్నారు.
మాటవరసకే స్త్రీ దేవత
మహిళలను గౌరవించడంలో భారతదేశం యొక్క ఖ్యాతి ఉన్నప్పటికీ, స్త్రీని దేవతగా భావించేంతవరకు మాత్రమే మాటలు ఉంటాయి తప్పా, మతాలు, ప్రాంతాలు, సమాజాలలో మహిళలు వివిధ రంగాలలో చిన్నచూపుతో పాటు నిర్లక్ష్యం చేయబడ్డారని చరిత్ర చెబుతుంది. కొన్ని విప్లవాత్మక ఉద్యమాలు మినహా, పురాతన, మధ్యయుగ, ప్రారంభ ఆధునిక కాలంలో మహిళ అభ్యుదయం లేదు. మహిళలు పిల్లలను పోషించే వారీగా, మరియు భావోద్వేగ సంరక్షణ అందించేవారిగా పురుషలోకం చూస్తుంది. ఒక అమ్మాయి తనకు తెలియకుండానే, అమ్మ ద్వారా అమ్మమ్మ ద్వారా స్వతంత్రంగా ఏ పని చేయకూడదనే మైండ్ సెట్ ఏర్పరుచుకుంటుంది. ఆత్మగౌరవం, స్వీయ-విలువ కు మహిళ దూరమైంది. వివాహం తరువాత, ఆమె భర్త, అత్తమామలు ఆమె జీవితాన్ని నియంత్రిస్తారు. పర్యవసానంగా, బయట ప్రపంచం మహిళకు దూరమైంది. ఆడపిల్లల వివక్ష, బాల్య వివాహం, వరకట్న వ్యవస్థ మొదలైనవి స్వాతంత్ర్యం తరువాత కూడా మనదేశంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని సరికొత్త చట్టాలను ప్రవేశపెడుతన్నదా అంటే సమాధానం శూన్యం! మనదేశంలో స్త్రీలు భారతదేశాన్ని పరిపాలించారు దేశ అధ్యక్షులుగా ప్రధానిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహిళలు ప్రఖ్యాతిగాంచారు అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది వీర మహిళలు పోరాటం చేసి అమరులయ్యారు అదేవిధంగా మన దేశంలో మహిళలు ఉన్నత ఉద్యోగాలలో ఉన్నప్పటికీ పెత్తనం మాత్రం పురుషులదే!!! ఐఏఎస్ ఐపీఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా చెప్పకపోతే ఎంతోమంది మహిళలు ఉన్నత స్థానాన్ని కాపాడుకుంటున్నారు అయినప్పటికీ బలహీన మాత్రం పురుషుడివే!! గ్రామస్థాయి నుంచి దేశస్థాయి వరకు మహిళలు ఎన్నో రంగాలలో రాణిస్తున్నారు అయినప్పటికీ వారికి గుర్తింపు లేదు!! వారు కూడా మన లాంటి మనుషులే అని పురుషులు గుర్తించుకోవాలి. అప్పుడే ఈ సమాజం మారుతుంది సర్వేజనా సుఖినోభవంతు!!!