Rafael Nadal: టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ రిటైర్మెంట్.. వ్యక్తిగత జీవితం, రికార్డ్స్ పూర్తి వివరాలు?
Rafael Nadal: టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ రిటైర్మెంట్.. వ్యక్తిగత జీవితం, రికార్డ్స్ పూర్తి వివరాలు?
స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ (38) రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఓ ఎమోషనల్ వీడియోలో నాదల్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అందులో నాదల్, "గత రెండు సంవత్సరాలు చాలా కష్టంగా గడిచాయి. అయితే నా ఆఖరి టోర్నమెంట్ డేవిస్ కప్ కావడం, స్పెయిన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండటం సంతోషంగా ఉంది. 2004 సెవిల్లాలో మొదటి విజయంతో మొదలైన నా కెరీర్‌ను డేవిస్ కప్ పరిపూర్ణం చేస్తుంది." అని పేర్కొన్నాడు. అయితే నాదల్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతడి నెట్ వర్త్, ఆదాయం సహా ఇతర విశేషాలు తెలుసుకుందాం..
నాదల్ వ్యక్తిగత జీవితం..
రఫెల్ నాదల్ 1986 జూన్ 3న స్పెయిన్‌లోని మల్లోర్కాలో జన్మించాడు. తండ్రి వ్యాపారవేత్త. అతడి బాబాయి టోని నాదల్, రఫెల్ నాదల్‌కు చిన్నప్పటి నుంచి శిక్షణ ఇచ్చాడు. ఎనిమిది సంవత్సరాల వయస్సుకే నాదల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లు గెలవడం ప్రారంభించాడు. బార్సిలోనాలో శిక్షణ పొందేందుకు ఆఫర్లు వచ్చినా, నాదల్ కుటుంబం అతడిని మల్లోర్కాలో ఉంచాలని నిర్ణయించుకుంది. నాదల్ తన స్నేహితురాలను 2019లో వివాహం చేసుకున్నాడు. ఈ జంట 2022లో కుమారుడు రఫెల్‌కు జన్మనిచ్చింది.
నాదల్‌కు టెన్నిస్‌తో పాటు ఫుట్‌బాల్, గోల్ఫ్, పోకర్ ఆడడం చాలా ఇష్టం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నాదల్ ఎడమ చేత్తో టెన్నిస్ ఆడినప్పటికీ, రోజువారీ కార్యకలాపాలకు మాత్రం కుడి చేతినే ఉపయోగిస్తాడు.
రఫెల్ నాదల్ సంపాదన..
కొన్ని నివేదికల ప్రకారం, 2024 నాటికి నాదల్ నెట్ వర్త్ సుమారు $225 మిలియన్లు. అతడి ఆదాయంలో ఎక్కువ భాగం టెన్నిస్‌లో సాధించిన విజయాల నుంచే వచ్చింది. కెరీర్ మొత్తంలో $135 మిలియన్ల కన్నా ఎక్కువ ప్రైజ్ మనీ అందుకొన్నాడు. 2024లోనే $23.3 మిలియన్లు సంపాదించాడు. ఫోర్బ్స్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం పొందే క్రీడాకారుల్లో నాదల్ ఒకడు.
వ్యాపార రంగంలో నాదల్..
టెన్నిస్లో కాకుండా నాదల్ పలు బిజినెస్లోనూ సంపాదనను ఇన్వెస్ట్మెంట్ చేశాడు. నైక్ (Nike), బాబోలాట్ (Babolat), కియా (Kia), టామీ హిల్‌ఫిగర్ (Tommy Hilfiger), ఆమ్స్టెల్ (Amstel) వంటి ప్రధాన బ్రాండ్‌లకు ఎండార్స్‌మెంట్ చేశాడు. నైక్ కంపెనీతో కలిసి చాలా కాలం పని చేశాడు. నైక్ నాదల్ పేరు మీద ప్రత్యేకమైన దుస్తులు, షూలను కూడా రిలీజ్ చేసింది. నాదల్ ఇతర బిజినెస్‌లలోకి కూడా ప్రవేశించాడు. మల్లోర్కాలో రఫా నాదల్ అకాడమీని స్థాపించాడు. అక్కడ యంగ్ టెన్నిస్ ప్లేయర్లకు శిక్షణ ఇస్తారు. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కూడా పెట్టుబడి పెట్టాడు. మెక్సికోలో కూడా టెన్నిస్ సెంటర్ ఏర్పాటు చేశాడు.
ఇకపోతే టెన్నిస్ అకాడమీతో పాటు నాదల్ అనేక వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టాడు. వీటిలో ఒకటి మాడ్రిడ్‌లోని టోటో రెస్టారెంట్. క్లాసిక్ సినిమా ప్యారడిసో ప్రేరణతో ప్రారంభించిన ఈ రెస్టారెంట్, మెడిటరేనియన్, ఇటాలియన్ వంటకాలను అందిస్తుంది.
అవార్డులు..
నాదల్ కెరీర్‌లో ఐదు ATP ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలిచాడు. అలానే ఐదు ITF వరల్డ్ ఛాంపియన్ టైటిళ్లను సాధించాడు. రెండుసార్లు ప్రతిష్టాత్మకమైన లారెస్ వరల్డ్ స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు.
విలాసవంతమైన జీవనశైలి..
నాదల్ విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదిస్తున్నాడు. అతడి నివాసం మల్లోర్కాలో ఉంది. ఈ అందమైన ఇల్లును 2003లో $4 మిలియన్లకు కొనుగోలు చేశాడు. నాదల్‌కు డొమినికన్ రిపబ్లిక్‌లోని ప్లేయా న్యూవా రొమానాలో ఒక విల్లా కూడా ఉంది. దీన్ని 2012లో $2 మిలియన్లకు కొనుగోలు చేశాడు.
మొత్తం టైటిల్స్..
కెరీర్ మొత్తంలో, నాదల్ 36 మాస్టర్స్ టైటిల్స్, రెండు ఒలింపిక్ బంగారు పతకాలు సహా 92 ATP సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు. అతడి ఖాతాలో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కూడా ఉన్నాయి.
రఫెల్ నాదల్ రికార్డ్స్...
టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ ఆటకు వీడ్కోలు పలికాడు. నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తన చివరి టోర్నీ అని తెలిపాడు. అయితే ఈ స్పెయిన్ బుల్ తన అద్భుతమైన ప్రదర్శనతో దాదాపు రెండు దశాబ్దాల పాటు క్లే కోర్టును శాసించాడు. ఊహకందని రీతిలో ఏకంగా 14 టైటిళ్లను ఖాతాలో వేసుకున్నాడు. ఓ సారి నాదల్ తన కెరీర్‌లో సాధించిన రికార్డులను తెలుసుకుందాం.
• రఫెల్ నాదల్ తన కెరీర్లో 22 గ్రాండ్ స్లామ్‌లు అందుకున్నాడు. నోవాక్ జకోవిచ్ 24 టైటిల్స్తో అగ్ర స్థానంలో ఉన్నాడు.
• నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్‌లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 14 టైటిల్స్‌ను ముద్దాడాడు. ఓపెన్లో శకంలో ఇదే అత్యధికం. జోర్న్ బోర్గ్ ఆరు టైటిళ్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
• రఫా 30 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్లో బరిలోకి దిగాడు. రోజర్ ఫెదరర్ (31), నోవాక్ జకోవిచ్ (37), నాదల్ కన్నా ముందున్నారు.
• ఓపెన్లో ఎర్రమట్టి కోర్టులో నాదల్ అత్యధికంగా 63 టైటిళ్లను అందుకున్నాడు.
• నాదల్ ఫ్రెంచ్ ఓపెన్లో 112 మ్యాచుల్లో విజయం సాధించాడు. నాలుగు సార్లు మాత్రమే పరాజయం అందుకున్నాడు. చివరగా ఈ ఏడాది అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో ఓడిపోయాడు.
• నాదల్ 92 ఏటీపీ సింగిల్స్ టైటిళ్లను ముద్దాడాడు. జిమ్మీ కానర్స్ 109 టైటిళ్లతో, రోజర్ ఫెదరర్ 103 టైటిళ్లతో, నోవాక్ జకోవిచ్ 99 టైటిళ్లతో, ఇవాన్ లెండి 94 టైటిళ్లతో తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు.
• స్పెయిన్ బుల్ 2004 నుంచి 2022 వరకు ఏటీపీ సింగిల్స్ టైటిల్‌ను వరుసగా అత్యధికంగా 19 సంవత్సరాలు గెలుచుకున్న రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
• 2005 - 2007 మధ్య క్లే కోర్టులో వరుసగా 81 మ్యాచుల్లో విజయాలు సాధించాడు.
• మెన్స్ సింగిల్స్లో కెరీర్ గోల్డెన్ స్లామ్ పూర్తి చేసిన ముగ్గురు ప్లేయర్స్లో రాఫెల్ నాదల్ ఒకడు. మిగతా ఇద్దరు ఆండ్రీ అగస్సీ, రోజర్ ఫెదరర్.
• కెరీర్లో గ్రాండ్ స్లామ్ సాధించడంతో పాటు ఒలింపిక్స్ సింగిల్స్, డబుల్స్‌లో గోల్డ్ సాధించిన ఏకైక ప్లేయర్ నాదల్.
• ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్స్‌పై అత్యధికంగా 23 విజయాలు సాధించిన ప్లేయర్గా నాదల్ రికార్డుకెక్కాడు.
• నాదల్ తన కెరీర్‌లో ఐదు సార్లు 2008, 2010, 2013, 2017, 2019 ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించాడు.