Teacher, Graduate MLC Elections: టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు రిజిస్టర్ చేసుకోండి ఇలా!
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు రిజిస్టర్ చేసుకోండి ఇలా!
త్వరలో జరగనున్న టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు..
రిజిస్ట్రేషన్ చివరి తేదీ నవంబరు 6..
అర్హత ఉన్న వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి..
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయ, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు ద్వారా ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సి ఉంది. చివరి తేదీ సమీపిస్తున్నా పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేయడంలో వెనకబడిపోతున్నారు. తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసుల్లోఎమ్మెల్సీ (మెంబర్ ఆఫ్ లెజిస్లెటివ్ కౌన్సిల్) ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పట్టభద్రులు, ఉపాధ్యాయులు ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవాలి.
మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే..
గతంలో జరిగిన ఎన్నికల సమయంలో నమోదు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని తహసీల్దార్, ఆర్డీవో (రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్) కార్యాలయాల్లో ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచారు. దరఖాస్తుల ప్రక్రియ పర్యవేక్షించడానికి ఓ అధికారిని కూడా ఓటరు నమోదు కేంద్రంలో నియమించారు.
ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో..
ఆన్‌లైన్‌లోనూ ఎలక్షన్ కమిషన్ ఓటరుగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫాం మొత్తం నింపి గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన డిగ్రీ సర్టిఫికేట్, ఆధార్, ఓటరు ఐడీ పత్రాలు, ఫోటోను జత చేసి www.ceotelangana.nic.in అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓటు నమోదు కు చివరి తేదీ- 06 నవంబరు 2024.
అర్హత వివరాలు..
2021 అక్టోబరు 31వ తేదీ నాటికి డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేషన్) పూర్తి చేసినవారు పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లుగా నమోదు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ రూపొందించిన ఫాం-18 పూరించి నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తే చాలు మీరు ఓటరుగా నమోదు అవుతారు. ఇక ఉపాధ్యాయుల్లో 2018 నవంబరు 1వ తేదీ నుంచి 2024 అక్టోబరు 31వ తేదీ వరకు మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులు ఫాం-19 దరఖాస్తు నింపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) ఉపాధ్యాయులు మూడేళ్ల సర్వీసు పూర్తయితే ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల నుంచి పలు అభ్యర్థులు ఉపాధ్యాయులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.