TGSRTC: టీజీఎస్ఆర్టీసీ విద్యార్థులకు ప్రత్యేక యాప్.. ఇక ప్రయాణికుల చిల్లర సమస్యలకు చెక్ !!
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ విద్యార్థులకు ప్రత్యేక యాప్.. ఇక ప్రయాణికుల చిల్లర సమస్యలకు చెక్ !!
టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక యాప్ ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. విద్యార్థుల బస్సు పాసుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకోచ్చే యోచనలో ఉంది. గ్రేటర్ పరిధిలో 5లక్షల మందికి పైగా విద్యార్థులు వేర్వేరు కళాశాలల్లో చదువుతున్నారు. వీరంతా బస్‌పాస్ రెన్యూవల్ కోసం ప్రతినెలా వరుసలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక యాప్ ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. యాప్‌తో బస్ పాస్‌లు పొందే వెసులుబాటు కలగనుంది. తద్వారా పాస్‌ను కండక్టర్‌కు మొబైల్‌లోనే చూపించి ప్రయాణించొచ్చు.
డిజిటల్ చెల్లింపుల ప్రక్రియకు వేళాయే..
అలాగే బస్సుల్లో కండక్టర్, ప్రయాణికులకు మధ్య ఎక్కడ చూసిన చిల్లర గొడవలు నిత్యకృత్యమయ్యాయి. ఈ సమస్యను తీర్చేందుకు పూర్తిస్థాయి డిజిటల్ చెల్లింపుల ప్రక్రియకు తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) సమాయత్తమైంది. ఇందుకు సంబంధించి బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్ డిపోల్లోని 140 బస్సుల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన డిజిటల్ చెల్లింపుల ప్రక్రియకు విశేష స్పందన వచ్చింది. దీంతో రెండు నెలల్లో గ్రేటర్‌లోని అన్ని డిపోల్లో అందుబాటులోకి తెచ్చేందుకు టీజీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. అవసరమైన 4,500 ఇంటలిజెంట్ టికెటింగ్ యంత్రాలను సమకూర్చుకుంటోంది. ఇవన్నీ ఇంటర్నెట్ ఆధారంగా పనిచేయనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 10,000 ఐటిమ్స్ యంత్రాలు అవసరమవుతుండగా సగం మేర గ్రేటర్‌లోనే వినియోగించనున్నారు. దీంతో క్యూఆర్ కోడ్ స్కానింగ్, కార్డు స్వైపింగ్‌తో ప్రయాణికులు టికెట్ కొనే వెసులుబాటు కలుగనుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో మెజార్టీ ప్రయాణికులు డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడ్డారు.
నోట్ల కష్టాలు..
ప్రయాణికులంతా బస్సుల్లో టికెట్ కొనుగోలుకు రూ.100, రూ.200 నోట్లు ఇస్తుండటంతో కండక్టర్లకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. అలాగే రూ.10 నాణేలను తీసుకోవడంలోనూ కండక్టర్లు, ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ నాణేన్ని తీసుకోవాలని ఆర్బీఐ కోరుతున్నా, స్వయంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించినా కొన్ని బస్సుల్లో తీసుకోవడం లేదంటూ ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు ప్రారంభమైతే చిల్లర కష్టాలు తీరిపోనున్నాయి.