ఆ దేశంలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావమే కారణం
ఆ దేశంలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావమే కారణం
• సోషల్ మీడియా వాడటానికి వయోపరిమితి..
• సోషల్ మీడియా వాడాలంటే కనీస వయసు 16ఏళ్ల..
• ఆస్ట్రేలియాలో పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించడానికి కొత్త చట్టం..
పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా సామాజిక మాధ్యమాలు ఉపయోగించడానికి కనీసం 16ఏళ్ల వయసు ఉండేలా పరిమితి విధించనున్నట్లు గురువారం ప్రకటించింది. సోషల్ మీడియా తమ పిల్లలకు హాని చేస్తోందని, దాన్ని ఉపయోగించడానికి సమయం ఉండాలని తాను కోరుతున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ అన్నారు. చట్టం ఆమోదించిన 12 నెలల తర్వాత వయోపరిమితి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ చట్టం అమలైన తర్వాత, ఎక్స్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి- సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు 16ఏళ్ల లోపు పిల్లలను తమ సైట్ల నుంచి ఎలా మినహాయించాలో తెలుసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించాలి. కాగా, దీనికి సంబంధించిన చట్టాన్ని నవంబర్ 18న ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వయోపరిమితిని సోషల్ మీడియా సంస్థలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఫైన్ విధించరు.
తాను చాలా మంది పిల్లల తల్లిదండ్రులు, తాతలు, ఆంటీలు, అంకుల్స్ తో మాట్లాడానని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. వారు కూడా తన లాగే ఆన్లైన్లో పిల్లల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలకు యాక్సెస్ నిరోధించడానికి సహేతుకమైన చర్యులు తీసుకుంటున్నామని తెలిపే బాధ్యత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఉంటుందన్నారు. అది పిల్లల తల్లిదండ్రులకు ఉండదన్నారు.
దీనిపై ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా, హెడ్ ఆఫ్ సేఫ్టీ యాంటిగోన్ డేవిస్ స్పందించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న వయోపరిమితులను తమ కంపెనీ గౌరవిస్తుందని చెప్పారు. అయితే ఈ నిబంధనలను ఎలా అమలు చేయాలనే దానిపై లోతైన చర్చ జరగలేదని చెప్పారు. అయితే యాప్ స్టోర్లలో, ఆపరేటింగ్ సిస్టమ్లలో సమర్థవంతమైన టూల్స్తో తల్లిదండ్రులువారి పిల్లలు ఏ యాప్ వాడాలో నియంత్రించవచ్చని చెప్పారు. ఇది చాలా సులభమైన, సమర్థవంతమైన పరిష్కారం అని అభిప్రాయపడ్డారు. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రకటనపై సామాజిక మాధ్యమం ఎక్స్ ఇంకా స్పందించలేదు.
పలు దేశాల్లో ఇప్పటికే పరిమితులు
పిల్లల మానసిక ఆరోగ్యంతో పాటు వారి చదువులపై కూడా సోషల్ మీడియా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నదని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తీసుకుంటున్న నిర్ణయాన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు. ఆస్ట్రేలియా నిర్ణయం ‘గొప్ప అడుగు’ అని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. ఇప్పటికే పలు దేశాలు సైతం పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 15 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించాలంటే కచ్చితంగా తల్లిదండ్రుల అనుమతి పొందాలని, పిల్లల వయసును సోషల్ మీడియా వేదికలు ధ్రువీకరించుకోవాలని గత ఏడాది ఫ్రాన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియా వినియోగానికి కనీస వయసును 15 ఏండ్లుగా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇటీవల నార్వే ప్రకటించింది.