Konark: రాష్ట్రపతి భవన్ అమృత్ ఉద్యాన్లో 'కోణార్క్' రథచక్రాలు
Konark: రాష్ట్రపతి భవన్ అమృత్ ఉద్యాన్లో 'కోణార్క్' రథచక్రాలు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం రథచక్రాల నమూనాతో ఎర్రని ఇసుకరాతితో రూపొందించిన నాలుగు చక్రాలను రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రం, అమృత్ ఉద్యాన్ లలో ప్రతిష్ఠించారు. భారతదేశ సమున్నత వారసత్వ వైభవాన్ని సందర్శకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ చక్రాలను ఏర్పాటు చేసారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, చారిత్రక ఆనవాళ్లను రాష్ట్రపతి భవన్లో ప్రవేశపెట్టడానికి తీసుకొంటున్న పలు చర్యల్లో భాగంగానే కోణార్క్ చక్రాల ప్రతిరూపాలను నెలకొల్పారు.
కోణార్క్ దేవాలయం గురించి:
ఈ సూర్య దేవాలయాన్ని క్రీ.శ. 1236 నుంచి 1264 సంవత్సర మధ్యకాలంలో గాంగ వంశానికి చెందినటువంటి గజపతి లాంగులా నరసింహదేవ 1 అనే రాజు కట్టించినట్లు అక్కడ వెలువడ్డ కొన్ని ఆధారాలు ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయాన్ని చంద్ర భాగ నది ఒడ్డున 230 అడుగుల ఎత్తులో, 7 గుర్రాలు, 24 చక్రాలు వున్న రథం ఆకారంలో కళింగ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఖోండలైట్ రాళ్లతో నిర్మించిన ఈ ఆలయాన్ని నల్ల పగోడా అనికూడా పిలుస్తారు. వార్షికంగా ఫిబ్రవరి నెలలో జరిగే చంద్రభాగ ఉత్సవం హిందువులకు ఎంతో పవిత్రమైనది. ఈ దేవాలయంలో కొంత భాగాన్ని క్రీ.శ.17 శతాబ్దం లో కూల్చి వేశారు అని చరిత్ర చెబుతోంది. అలా కూల్చిన ప్రదేశంలో ఏకంగా 52 టన్నుల పెద్ద అయస్కాంతం వుండేదని, ఈ అయస్కాంతం గుడిలో ఉన్న విగ్రహాన్ని తేలేలా చేసేది అని చరిత్రకారులు స్పష్టం చేశారు. ఈ ఆలయంలో ఉన్న రథచక్రాలు సన్ డైల్స్ లాగా పనిచేస్తాయి. ఈ సన్ డైల్స్ ఇప్పటికీ ఖచ్చితమైన సమయాన్ని చూపిస్తాయి అంటే మన భారతదేశ నిర్మాణ నైపుణ్యం ఎంతటిదో చక్కగా తెలుస్తోంది. అందుకే ఈ దేవాలయాన్ని యునెస్కో 1984లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
కళింగ నిర్మాణాశైలి గురించి:
భారతదేశంలో హిందూ దేవాలయాలన్నీ ప్రధానంగా నగర, వేసర, ద్రవిడ మరియు గడగ్ నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి. కళింగ నిర్మాణ శైలిలో హిందూ దేవాలయాలు ప్రధానంగా ఒడిషా రాష్ట్రంలో కనిపిస్తాయి, ఈ శైలి నగర నిర్మాణ శైలిలో భాగంగా ఉంటుంది.
ఒడిషాలోని ఇతర ముఖ్యమైన స్మారక చిహ్నాలు:
జగన్నాథ దేవాలయం,
తారా తారిణి ఆలయం,
ఉదయగిరి మరియు ఖండగిరి గుహలు,
లింగరాజ దేవాలయం.