అతివేగంతో డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ముగ్గురు మైనర్లు మృతి
అతివేగంతో డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ముగ్గురు మైనర్లు మృతి
• రాజేంద్రనగర్ మండలంలో ప్రమాదం, ముగ్గురు మృతి..
• శివరాంపల్లి వద్ద కొత్త పైవంతెనపై డివైడర్‌ను ఢీకొన్న బైకు..
• ఇద్దరు అక్కడికక్కడే మృతి, మార్గం మధ్యలో మరొకరు మృతి..
అతి వేగం కారణంగా హైదరాబాద్ లోని బహుదూర్ పుర్ నుంచి ఆరంఘర్ వెళ్లే కొత్త ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. బహదూర్ పూరాకు చెందిన మైనర్లు మాస్ ఖాద్రీ, మహ్మద్ అహ్మద్, మరో బాలుడు బైక్పై ఆరంఘర్ వైపు వెళ్తుండగా శివరాంపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. బైక్ అధిక వేగంతో ముందుకు దూసుకుపోవడంతో అదుపు తప్పి ముందుగా ఎలక్ట్రిక్ పోల్ను ఢీ కొట్టింది. ఆ తర్వాత డివైడర్ను ఢీ కొట్టడంతో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో ఉన్న మరో మైనర్ బాలుడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గం మధ్యలో అతడు కూడా మృతి చెందాడు.
ఈ ప్రమాదం మృతుల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. మాస్ ఖాద్రీ, మహ్మద్ అహ్మద్ కుటుంబ సభ్యులు తమ కొడుకులను కోల్పోవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. వీరి మరణంతో బహదూర్ పూరా ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల ప్రకారం, ప్రమాదానికి మితిమీరిన వేగం, త్రిబుల్ రైడింగ్ ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనుమతించని రీతిలో ముగ్గురు ఒకే బైక్పై ప్రయాణించడం ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్లైఓవర్పై ట్రాఫిక్ నియంత్రణ కోసం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అధిక వేగంతో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈనెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహిస్తున్నా ప్రతి ఒక్కరూ హెల్మెట్ కచ్చితంగా ధరించాలని,మద్యం సేవించి,అధిక వేగంతో వాహనాలు నడపరాదని, వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని,రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని కోరుతున్నారు.