రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర రక్తస్రావం.. ప్రాథమిక చికిత్స చేసిన మంత్రి
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర రక్తస్రావం.. ప్రాథమిక చికిత్స చేసిన మంత్రి
• ప్రకాశం బ్యారేజి వద్ద బైక్ ల ఢీ..
• ఓ యువకుడి తలకు దెబ్బ..
• తీవ్ర రక్తస్రావం కాకుండా కాపాడిన నాదెండ్ల..
• విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న మంత్రి నాదెండ్ల..
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవత్వంతో ప్రథమ చికిత్స చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి తీవ్ర రక్తస్రావం కాకుండా కాపాడారు. అతడికి ప్రథమ చికిత్స చేశారు.
వివరాల్లోకి వెళితే... మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద రెండు బైక్ లు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడి తలకు దెబ్బతగిలింది. రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల వెంటనే తన వాహనం ఆపారు. సిబ్బంది సాయంతో ఆ యువకుడికి ప్రథమ చికిత్స చేశారు. తల నుంచి తీవ్ర రక్తస్రావం కాకుండా ఆపారు. 108కి ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించి, అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడ్ని 108 సిబ్బంది అంబులెన్స్ లో తరలించే వరకు మంత్రి నాదెండ్ల ఘటన స్థలంలోనే ఉన్నారు. అతడికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని అంబులెన్స్ సిబ్బందికి మంత్రి నాదెండ్ల సూచించారు. ఆ యువకుడిని విజయవాడలో హెల్ప్ ఆసుపత్రిలో చేర్చుతున్నట్టు 108 సిబ్బంది సమాచారం అందించారు. కాగా, ఆ యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా, ఎంతో బిజీ షెడ్యూల్ లోనూ మంత్రి నాదెండ్ల మనోహర్ రోడ్డుపై జరిగిన ప్రమాదాన్ని చూసి కారు ఆపడం, క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించే వరకు అక్కడే ఉండడం పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది.