రైతులకు గుడ్ న్యూస్.. మళ్లీ ఖాతాల్లోకి డబ్బులు
రైతులకు గుడ్ న్యూస్.. మళ్లీ ఖాతాల్లోకి డబ్బులు
దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే మళ్లీ రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులు ఎప్పుడు పడతాయో తేలిపోయింది.
దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అది ఏంటంటే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) స్కీం కింద రైతులకు 19వ విడత డబ్బుల సాయం అందించే తేదీ ఖారారైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24, 2025న విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రం నుంచి ఈ 19వ విడత నిధులను విడుదల చేయనున్నారు. కిసాన్ యోజన కింద అర్హత కలిగిన రైతు ఖాతాకు రూ. 2,000 చొప్పున మంజూరు చేస్తారు.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని ప్రతి సంవత్సరమూ కొనసాగించడమే కాక, క్రమం తప్పకుండా విడతలుగా రైతుల ఖాతాలకు డబ్బు జమ చేయడం ద్వారా, రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి దోహదపడుతోంది.
19వ విడత పంపిణీ..
గత 18వ విడత, 2023 అక్టోబర్ 5న మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి విడుదలయ్యింది. ఇందులో 9 కోట్ల రైతుల ఖాతాలకు రూ. 20,000 కోట్లను జమ చేశారు. ఈ విషయాన్ని బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన కర్పూరి ఠాకూర్ 101వ జయంతి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ "వ్యవసాయం, రైతుల అభివృద్ధికి బీహార్ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందని ప్రస్తావించారు. ఈ క్రమంలో 19వ విడత పంపిణీకి ప్రధాని బీహార్ రాబోతున్నారని స్పష్టం చేశారు.
6,000 చొప్పున ఆర్థిక సహాయం...
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రైతులకు ఆర్థిక సహాయం అందించడం, వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడింది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,000 చొప్పున జమ చేస్తారు. ఈ పథకం ద్వారా రైతులకు మేలు చేయడమే కాక, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నగదు రూపంలో సాయం అందిస్తున్నారు. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 18 విడతలుగా రూ. 2 లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాలకు జమ చేశారు.
👉పీఎం కిసాన్ లబ్ధిదారులు వారి జాబితాను ఎలా చూసుకోవాలంటే..
• రైతులు తమ గ్రామం, జిల్లా, రాష్ట్రం ఆధారంగా PM-KISAN యోజన లబ్ధిదారుల జాబితాను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. లభ్యమయ్యే సమాచారాన్ని తెలుసుకోవడానికి, మీరు ఈ క్రింది విధానాలను పాటించాలి.
• ముందుగా PM-KISAN అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ను సందర్శించండి
• ఆ తర్వాత నో యూవర్ స్టేటస్ పై క్లిక్ చేయండి
• అక్కడ మీరు నమోదు చేసిన రిజి స్ట్రేషన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి
• ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్న సమాచారం మీకు చూపిస్తుంది
• జాబితాలో మీ పేరు ఉంటే మీరు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందవచ్చు