Chloride blood test: క్లోరైడ్ బ్లడ్ టెస్ట్ అంటే ఏమిటి? ఏ వ్యాధులకు ఈ టెస్ట్ చేస్తారు..!
Chloride blood test: క్లోరైడ్ బ్లడ్ టెస్ట్ అంటే ఏమిటి? ఏ వ్యాధులకు ఈ టెస్ట్ చేస్తారు..!
>> వాంతులు, విరేచనాలు, కిడ్నీ సమస్యల లాంటి అనారోగ్యాలకు అసలు కారణాలు బయటపెట్టే పరీక్ష ఇది..
>> రక్తంలో పీహెచ్ స్థాయి సహా శరీర ద్రవాల సమతౌల్యతను కాపాడటంలో దోహదపడే క్లోరైడ్..
>> క్లోరైడ్ స్థాయిల హెచ్చుతగ్గులు తెలిస్తే సులువుగా రోగనిర్ధారణ..
సాధారణంగా బ్లడ్ టెస్ట్ అనగానే మనం షుగర్, కొలెస్టరాల్, థైరాయిడ్ పరీక్షలే చేయించుకుంటాం. జ్వరాల సీజన్ లో అయితే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధుల నిర్ధారణ కోసం రక్త నమూనాలు ఇస్తాం. కానీ మీరెప్పుడైనా క్లోరైడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారా? అదేం పరీక్ష, దానివల్ల ఏం లాభం అనుకుంటున్నారా? అయితే దీనిపై ఓ లుక్కేయండి.
క్లోరైడ్ అంటే ?
పొటాషియం, సోడియం, క్యాల్షియం లాగానే క్లోరైడ్ కూడా ఒక ఎలక్ట్రోలైట్. మన శరీరానికి అవసరమైన ఖనిజాల్లో ఇది కూడా ఒకటి. ఇది నీటిలో కరిగి ఉంటుంది. రక్తంలో పీహెచ్ స్థాయి సహా శరీర ద్రవాల సమతౌల్యతను కాపాడేందుకు దోహదపడుతుంది. రక్తపోటు, రక్త పరిమాణం తగిన స్థాయిలో ఉండేలా చూస్తుంది. మనం ఉపయోగించే సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్.. దీని నుంచే మన శరీరానికి క్లోరైడ్ లభిస్తుంటుంది.
ఎందుకీ క్లోరైడ్ పరీక్ష?
రక్తంలో క్లోరైడ్ స్థాయులను తెలుసుకోవడానికి చేసేదే క్లోరైడ్ బ్లడ్ టెస్ట్ లేదా సీరమ్ క్లోరైడ్ టెస్ట్. వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్ తో బాధపడుతున్నప్పుడు లేదా కిడ్నీ, అడ్రినల్ గ్రంథి పనితీరు తెలుసుకోవడానికి ఈ రక్త పరీక్ష చేస్తారు. అలాగే హైబీపీ, హైపర్ హైడ్రోసిస్ (అధికంగా చెమటపట్టడం), కండరాల బలహీనత, శ్వాస సమస్యలు, నిస్సత్తువ, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా క్లోరైడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అవసరం.
రక్తంలో క్లోరైడ్ ఎంత రేంజ్ లో ఉండాలి..?
పెద్దలకైతే 96 నుంచి 100 ఎంఈక్యూ\ఎల్ (ఎంఈక్యూ అంటే.. ప్రతి లీటర్ రక్తంలో వెయ్యో వంతుకు సమానం) మధ్య... పిల్లలకైతే 95 నుంచి 108 ఎంఈక్యూ\ఎల్ మధ్య, నవజాత శిశువులకైతే 96 నుంచి 113 ఎంఈక్యూ\ఎల్ మధ్య క్లోరైడ్ స్థాయి ఉండాలి. ఒకవేళ క్లోరైడ్ స్థాయి అంతకన్నా తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే మీరు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అర్థం. అలాంటప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. క్లోరైడ్ హెచ్చుతగ్గులకుగల కారణాలు తెలుసుకోవడానికి డాక్టర్ మరిన్ని పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేయడంతోపాటు చికిత్స అందిస్తారు.
రక్తంలో క్లోరైడ్ స్థాయులు తక్కువైతే వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే..
• బార్టర్ సిండ్రోమ్ (ఉప్పు, ఇతర ఎలక్ట్రొలైట్లను కిడ్నీలు తిరిగి శోషించుకోలేకపోవడం)
• అడ్డిసన్స్ డిసీజ్ (అడ్రినల్ గ్రంథిలో కార్టిసాల్ లేదా ఆల్డోస్టెరాన్ హార్మోన్ స్థాయులు తగినంత లేకపోవడం)
• కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ (శరీర అవసరాలకు అనుగుణంగా గుండె తగినంత రక్తాన్ని సరఫరా చేయలేకపోవడం)
• కషింగ్స్ సిండ్రోమ్ (అడ్రినల్ గ్రంథుల్లో లోపంతో అధిక కార్టిసాల్ ఉత్పత్తి కావడం)
• నిస్సత్తువ, తీవ్ర అలసట
• హైపర్ హైడ్రోసిస్ (అధికంగా చెమటపట్టడం)
• హైపర్ ఆల్డోస్టెర్నోయిజం (అడ్రినల్ గ్రంథ్రులు దెబ్బతినడం వల్ల ఆల్డోస్టెరోన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి కావడం)
• మెటబాలిక్ ఆల్కలోసిస్ (రక్తంలో పీహెచ్ స్థాయి సాధారణం కన్నా ఎక్కువగా ఉండటం)
• రెస్పిరేటరీ అసిడోసిస్ (రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ ను ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో బయటకు పంపలేకపోవడం వల్ల రక్తం ఆమ్లపూరితం కావడం)
• ఎస్ఐఏడీహెచ్ (శరీరంలో అధికంగా నీరు నిల్వ ఉండటం)
శరీరంలో క్లోరైడ్ ఎక్కువైతే వచ్చే అనారోగ్య సమస్యలివే..
• కిడ్నీ వ్యాధి
• ఎథిలీన్ గ్లైకాల్ పాయిజనింగ్
• కీటోఎసిడోసిస్ (రక్తంలో ఆమ్లాల పెరుగుదల)
• లాక్టిక్ ఎసిడోసిస్ (రక్తంలో లాక్టిక్ ఆమ్లాల పెరుగుదల)
• మెటబాలిక్ ఎసిడోసిస్ (కిడ్నీ వ్యాధి లేదా కిడ్నీ వైఫల్యం వల్ల శరీరంలో ఆమ్లాలు పెరిగిపోవడం)
• మెథనాల్ పాయిజనింగ్
• డిస్టల్ లేదా ప్రాక్జిమల్ రెనల్ ట్యూబులర్ ఎసిడోసిస్
• రెస్పిరేటరీ ఆల్కలోసిస్ (అధికంగా శ్వాస తీసుకోవడం వల్ల రక్తంలో కార్బన్ డైయాక్సైడ్ స్థాయులు తగ్గిపోవడం)
• శాలిసైక్లేట్ టాక్సిసిటీ (యాస్పిరిన్ ఓవర్ డోస్ లాంటిది)
• కార్బోనిక్ యాన్ హైడ్రేస్ ఇన్హిబిటర్స్ (గ్లకోమా చికిత్స కోసం వాడే మందుల వల్ల క్లోరైడ్ స్థాయుల పెరుగుదల)