SI Suicide: తుపాకీతో కాల్చుకుని పోలీసు స్టేషన్లో ఎస్సై ఆత్మహత్య
SI Suicide: తుపాకీతో కాల్చుకుని పోలీసు స్టేషన్లో ఎస్సై ఆత్మహత్య
సీఎం శుక్రవారం పెనుగొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వీఆర్‌లో ఉన్న మూర్తికి బందోబస్తు విధులు అప్పగించారు. నిన్న భీమవరం డిపో నుంచి తుపాకీ తెచ్చుకుని తణుకు గ్రామీణ పీఎస్‌కు రిపోర్టు చేయడానికి వచ్చాడు. అయితే ఈ రోజు ఉదయం స్టేషన్‌లో వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామీణ పీఎస్‌లో వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ ఏజీఎస్ మూర్తి స్టేషన్‌లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్సై.. ఇటీవల సస్పెన్షన్ కు గురయ్యారు. అవినీతి కేసులో మూర్తిపై పలు ఆరోపణలు రావడంతో ఆయన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం వీఆర్ లో ఉన్న మూర్తి.. శుక్రవారం ఉదయం పెనుగొండలో సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్లే క్రమంలో పీఎస్ కు వచ్చారు. కొంతసేపు అక్కడే కూర్చొని.. ఆ తర్వాత బాత్రూమ్ లోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.
ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం రావడంతో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది అప్రమత్తమై అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పడికే ఆయన మృతి చెందాడు. గత కొన్ని రోజుల క్రితం ఎస్సై మూర్తిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేసి వీఆర్‌లో ఉంచారు. ఎస్సై ఆత్మహత్య విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు అధికారులు విచారం వ్యక్తం చేశారు. తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.