అనుకోకుండా తప్పు నంబర్‌కి డబ్బులు పంపించారా... అయితే మీ మనీ ఇలా తిరిగి పొందండి
అనుకోకుండా తప్పు నంబర్‌కి డబ్బులు పంపించారా... అయితే మీ మనీ ఇలా తిరిగి పొందండి
ఈ రోజూ దేశ ఆర్థిక వ్యవస్థలో యూపీఐ చెల్లింపు విధానం ఒక విప్లవంలా వచ్చి, ఇప్పుడు అనేక మందికి ఒక అలవాటుగా మారిపోయింది. ఎవరికైనా, ఎప్పుడైనా మనీ పంపాలంటే చాలు క్షణాల్లోనే పంపించగలుగుతున్నారు. UPI ఇలా ప్రతి చెల్లింపులను కూడా సులభతరం చేసింది. కొన్ని సెకన్లలోనే QR స్కాన్ చేయడం ద్వారా, మీ డబ్బు పూర్తి భద్రతతో బదిలీ చేయబడుతుంది. అయితే కొన్ని సార్లు పలువురు అనుకోకుండా వేరొకరి ఖాతాకు డబ్బు పంపిస్తారు. ఒకరి నంబర్‌కు బదులు మరొకరి నంబర్ కు కొట్టి మనీ పంపిస్తారు. ఆ తరువాత డబ్బును ఎలా తిరిగి పొందాలో తెలియక అనేక మంది ఆందోళన చెందుతారు.
ఆందోళన అక్కర్లేదు..
ఇలాంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కొన్ని సులభమైన విధానాలు అనుసరించడం ద్వారా మీరు మీ డబ్బును తిరిగి పొందవచ్చు. అది ఎలాగో ఇక్కడ చూద్దాం..
• మీరు పొరపాటున డబ్బు పంపిన వ్యక్తిని సంప్రదించడం మొదటి దశ.
• మీరు లావాదేవీ వివరాలను అందించి, డబ్బు తిరిగి ఇవ్వమని అభ్యర్థించవచ్చు.
• చాలా సందర్భాల్లో వారు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.
• లేదంటే మీ UPI యాప్‌లోని కస్టమర్ సపోర్ట్ టీమ్‌తో మాట్లాడండి. వారు మీకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు. లావాదేవీ వివరాలను అందించడం ద్వారా, వారు మీ ఫిర్యాదును పరిశీలిస్తారు.
ఇలా ఫిర్యాదు చేయవచ్చు..
మీరు ఎప్పుడైనా తప్పు UPI చెల్లింపు చేస్తే ముందుగా మీ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ విభాగానికి ఫోన్ చేయాలి. UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా తప్పు ఖాతాకు డబ్బు బదిలీ అయిన తర్వాత, మీరు టోల్ ఫ్రీ నంబర్ 18001201740కు కాల్ చేయడం ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. చెల్లింపునకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని మీరు వారికి తెలియజేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల UPIలో తప్పుడు లావాదేవీలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం మీరు తప్పు UPI IDకి డబ్బు పంపినట్లయితే, 24 నుంచి 48 గంటలలోపు మీ డబ్బును తిరిగి పొందవచ్చు. అయితే ఇది పంపేవారు, స్వీకరించేవారు ఒకే బ్యాంకును ఉపయోగించినప్పుడు వేగంగా జరుగుతుంది. వేర్వేరు బ్యాంకులను ఉపయోగించినప్పుడు, వాపసు ప్రక్రియకు కొంత సమయం ఎక్కువ పడుతుంది.
సమస్య పరిష్కారం కాకపోతే
మీరు సంతృప్తి చెందకపోతే మీరు NPCI పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. పోర్టల్‌కి వెళ్లి 'What we do' పై క్లిక్ చేయండి. మీకు ఇక్కడ అనేక ఆప్షన్స్ కన్పిస్తాయి. వాటిలో UPI ని ఎంచుకోండి. దీని తరువాత, 'ఫిర్యాదు విభాగం'కి వెళ్లి లావాదేవీ వివరాలను పూరించండి. దీనిలో, బ్యాంక్ పేరు, ఇమెయిల్, ఫోన్ నంబర్, UPI ID మొదలైన సమాచారాన్ని ఇవ్వండి. ఆ తర్వాత ‘తప్పుగా UPI చిరునామాకు బదిలీ చేయబడింది’ అనే ఆప్షన్ ఎంచుకోండి. దీంతో పాటు, చెల్లుబాటు అయ్యే పత్రాలను కూడా యాడ్ చేయండి.
30 రోజుల్లో పరిష్కారం దొరకకపోతే..
ఫిర్యాదు దాఖలు చేసిన 30 రోజుల్లోపు సమస్య పరిష్కారం కాకపోతే, మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను కూడా సంప్రదించవచ్చు. నిబంధనల ప్రకారం సంఘటన జరిగిన 3 రోజుల్లోపు మీరు తప్పుడు లావాదేవీ గురించి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.