Economic Survey: ఆర్థిక సర్వే అంటే ఏంటీ? బడ్జెట్‌కు ముందే ఎందుకు ప్రవేశపెడతారు?
Economic Survey: ఆర్థిక సర్వే అంటే ఏంటీ? బడ్జెట్‌కు ముందే ఎందుకు ప్రవేశపెడతారు?
• జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
• ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది..
• ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది..
• బడ్జెట్‌కు ముందురోజు ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు..
Economic Survey: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పిస్తారు. బడ్జెట్‌కు ముందురోజు అంటే శుక్రవారం ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఈ సర్వే గత సంవత్సరంలో ప్రభుత్వం పనితీరుపై సమగ్ర విశ్లేషణను అందించే వివరణాత్మక రిపోర్ట్‌కార్డ్ లాంటిది. ఈ సర్వే జీడీపీ, వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి వంటి వివిధ కీలక విషయాల రించి వివరిస్తుంది. అలాగే, కొత్త ఆర్థిక అవకాశాలు, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్ల గురించి చెబుతుంది. అలాగే, ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగించే అంశాలు ఏమైనా ఉంటాయా? ఎలా ఎదుర్కోవాలి?.. ఆర్థిక వ్యవస్థ సరైన వేగంతో నడిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సైతం ఈ సర్వే హెలైట్ చేస్తుంది.
ఆర్థిక సర్వేను బడ్జెట్‌కు ప్రధాన ఆధారమని చెబుతుంటారు. సామాన్యుల దృష్టిలో.. ఆర్థిక సర్వే ద్రవోల్బణం, నిరుద్యోగం, తదితర కీలక విషయాల గురించి సమాచారం అందిస్తుంది. పెట్టుబడులు, పొదుపు, ఖర్చుల విషయంలో ఆలోచన తీసుకువచ్చేలా చేస్తుంది. ఆర్థిక సర్వే పెట్టుబడిదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎక్కడ మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నయో అర్థం చేసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆర్థిక సర్వేను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థ స్థితి గురించి గణనీయమైన డేటాను అందిస్తుంది. ప్రజాప్రతినిధులు, పెట్టుబడిదారులతో పాటు పౌరులు తదితర వాటాదారులందరూ రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక వ్యూహం, లక్ష్యాలను అంచనా వేసేందుకు సహాయపడుతుంది.
ఆర్థిక వ్యూహాలు లక్ష్యాలను అంచనా వేసేందుకు..
ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోకి వచ్చే ఆర్థిక వ్యవహారాల శాఖ తయారు చేస్తుంది. గత సంవత్సరంలో భారతదేశ ఆర్థిక స్థితిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఈ సర్వే తయారు చేశారు. ముఖ్యమైన పరిశ్రమలు, వ్యవసాయం, సర్వీసెస్ గురించి డేటాను అందించడంతో పాటు ముఖ్యమైన ఆర్థిక ఇండికేటర్స్‌ను మూల్యాంకనం చేస్తుంది. ఆర్థిక సర్వే సాధారణంగా రెండు విభాగాలుగా తయారవుతుంది. తొలిభాగంలో ఆర్థిక ధోరణులు, ఆర్థిక అభివృద్ధి, రంగాల పరితీరుపై దృష్టి పెడుతుంది. రెండోది పేదరికం, ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణ ఆందోళనలు, వాణిజ్య సమతుల్యత, విదేశీ మారక నిల్వలు వంటి ఆర్థిక అంచనాలపై దృష్టి సారిస్తుంది.
బడ్జెట్‌కు ఒక రోజు ముందు..
ఇక ఆర్థిక సర్వేను ప్రధాన ఆర్థిక సలహాదారు నాయకత్వంలో తయారవుతుంది. సీఈఏ, ఆర్థికవేత్తలు, విశ్లేషకుల బృందంతో కలిసి వివిధ విభాగాలు, పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ సంస్థల నుంచి డేటాను సేకరించి వివరణాత్మక నివేదికను రూపొందిస్తుంది. నివేదిక తయారయ్యాక బడ్జెట్‌కు ఒక రోజు ముందు పార్లమెంట్‌లో ఈ ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతారు. 1950-51 సంవత్సరంలో తొలిసారిగా ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ రోజునే సభలో ప్రవేశపెట్టేవారు. 1964 నుంచి బడ్జెట్‌కు ముందురోజు సమర్పిస్తూ వచ్చారు. ప్రస్తుతం అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సంప్రదాయం కొనసాగుతున్నది.