Inter: ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
Inter: ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లాలో ఎక్కడా ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకూడదు
-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, ఫిబ్రవరి 20 (పీపుల్స్ మోటివేషన్):- మార్చి 1వ తేది నుండి 20వ తేది వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించి జిల్లాలో ఎక్కడా ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకూడదని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబధిత అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ లు,మండల స్పెషల్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేది నుండి మార్చి 20వ తేది వరకు 69 సెంటర్ల లో 45,325 (మొదటి సంవత్సరం 23,098, రెండవ సంవత్సరం 22227) మంది విద్యార్థులు హాజరు అవుతున్నారన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ఆయా శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రశ్నా పత్రాల భద్రతకు ఆర్మ్డ్ గార్డ్స్ ఏర్పాటు తో పాటు పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రశ్నా పత్రాలు స్టోరేజ్ పాయింట్ నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లే వరకు పోలీసు ఎస్కార్ట్ ఉండాలన్నారు. రెవెన్యూ, పోలీస్, విద్యా శాఖ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీములను నియామకం చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని కలెక్టర్ డిఆర్వో ను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం లోపు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ప్రతి ఎగ్జామినేషన్ హాల్ లో త్రాగు నీరు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో సరిపడా లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్లు రెండు మూడు రోజుల్లోపు తమ పరిధిలోని అన్ని కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలించి నివేదికను ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్రాల వద్ద పరిశుభ్రత ఉండేలా సంబంధిత మున్సిపల్ కమీషనర్లు, డిపిఓ చర్యలు తీసుకోవాలన్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్స్, అవసరమైన మందులు ఏర్పాటు చేయాలని డీఎంఎచ్ వో ను ఆదేశించారు..పరీక్ష కేంద్రాలకు బస్సు సౌకర్యం ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్టీసీ ఆర్ఎం ను ఆదేశించారు.పరీక్షా కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ని ఆదేశించారు.
గత పరీక్షల నిర్వహణ సందర్భంగా జరిగిన సంఘటనలను బట్టి, 7 సెంటర్లలో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని, ఆయా సెంటర్ల లో ఎలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్ సూపరింటెండెంట్ లను ఆదేశించారు. అలాగే సిటింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో అడిషనల్ ఎస్పీ, డిఆర్వో, ఆర్ ఐ ఒ, డిఎంఎచ్వో, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ తదితరులు పాల్గొన్నారు.