ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి
ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
అనంతపురం, (పీపుల్స్ మోటివేషన్):-
వేసవి నేపథ్యంలో ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సూచించారు.
వడదెబ్బ లక్షణాలు:
• తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన జ్వరం కలిగియుండటం మత్తు నిద్ర కలవరింతలు, ఫిట్స్, లేదా పూర్తి అపస్మారక స్థితి.
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
✔ తెలుపు రంగుగల పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలి.
✔ తలకు టోపి పెట్టుకోవాలి లేదా రుమాలు కట్టుకోవాలి.
✔ ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోస్ కలిపిన నీటిని త్రాగవలెను. ఓరల్ రీహైడ్రేషన్ కలిపిన నీటిని త్రాగవచ్చును.
✔ వడదెబ్బకు గురి అయిన వారిని నీడగా ఉన్న చల్లటి ప్రాంతానికి వెంటనే చేర్చాలి.
✔ వడదెబ్బకు గురి అయిన వారిని తడిగుడ్డతో శరీరం అంతా తుడువవలెను. ఐస్ వాటర్ బట్టను నుంచి శరీరం అంతా తుడువవలెను. శరీర ఉష్ణోగ్రత 101 - డిగ్రీస్ కంటే లోపునకు వచ్చేవరకు ఐస్ వాటర్ బట్టతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి మరియు ఫ్యాన్ కింద ఉంచాలి.
✔ వడదెబ్బకు గురి అయినవారు సాధారణ స్థితికి రానిచో వారిని శీతల వాతావరణంలో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించవలెను.
✔ మంచినీరు ఎక్కువ సార్లు త్రాగాలి.
✔ ఇంటి నుంచి బయటకు వెళ్ళేముందు ఒక గ్లాసు మంచి నీరు త్రాగాలి.
✔ ఎండలో నుంచి వచ్చిన వెంటనే చల్లని నిమ్మరసముగాని, కొబ్బరి నీరు లేదా చల్లని నీరు త్రాగాలి.
✔ తీవ్రమైన ఎండలో బయటికి వెళ్ళినప్పుడు తలతిరుగుట మొదలైన అనారోగ్య సమస్యలు ఏర్పడితే దగ్గరలో వున్న డాక్టరు గారిని సంప్రదించి ప్రాథమిక చికిత్స పొంది వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చును.
ఎండ తీవ్రంగా ఉన్నపుడు చేయకూడనివి:
• సూర్య కిరణాలకు, వేడి గాలికి గురి కాకుడదు, వేడిగా ఉన్న సూర్యకాంతిలో గొడుగు లేకుండా తిరగరాదు.
• వేసవికాలంలో నలుపురంగు దుస్తులు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
• తలకు టోపీ లేక రుమాలు లేకుండా సూర్యకాంతిలో తిరగరాదు.
• వడదెబకు గురి అయిన వారిని వేడి నీటిలో ముంచిన బట్టతో తుడవరాదు.
• దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏమాత్రం ఆలస్యం చేయరాదు.
• మధ్యాహ్నం తరువాత (అనగా ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల మధ్య కాలంలో) ఆరుబయట ఎక్కువ శారీరిక శ్రమతో కూడిన పని చేయరాదు.
• ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్ధములు మరియు తేనె తీసుకొన కూడదు.
• శీతలపానీయములు, మంచు ముక్కలు వంటివి తీసుకొంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యము ఏర్పడుతుంది. వడదెబ్బకు గురికాకుండా ప్రజలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూచనలను పాటించాలని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.