GST: చేనేత ముడి సరుకుపై జీఎస్టీ తొలగించాలి.!
GST: చేనేత ముడి సరుకుపై జీఎస్టీ తొలగించాలి.!
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత మరియు జౌళి రంగ అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల కోసం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్ర అధికారులతో భేటీ
న్యూఢిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్ర అదనపు కార్యదర్శి రోహిత్ కంసాల్, హస్తకళల అభివృద్ధి కమిషనర్ శ్రీమతి అమృత రాజ్, చేనేత అభివృద్ధి కమిషనర్ శ్రీమతి మ. బీనాలను కలుసుకుని, రాష్ట్రంలో, చేనేత, హస్తకళ రంగాల అభివృద్ధిపై చర్చించారు.
ఈ సందర్భంగా గుంతకల్ స్పిన్నింగ్ మిల్లు పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 1991 నుంచి మూసివేయబడిన ఈ మిల్లును మళ్లీ ప్రారంభించేందుకు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ మిల్లును తిరిగి ప్రారంభిస్తే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరిగి, ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని పేర్కొన్నారు.
టెక్స్టైల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీం..
హిందూపురం వ్యాపార్ అపారెల్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్క్, గుంటూరు టెక్స్టైల్ పార్క్ లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి వివరాలు కోరారు. రాష్ట్రానికి కేంద్రం అందించే నిధులు త్వరగా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
అమరావతిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) ఏర్పాటు..
చేయాలని ప్రత్యేకంగా అభ్యర్థించారు. ధర్మవరం, మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ వంటి ప్రముఖ చేనేత కేంద్రాలు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు రాష్ట్రంలో NIFT క్యాంపస్ లేదు. ఈ కారణంగా, అమరావతిలో ఒక ప్రత్యేక క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు.
నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (NHDP)..
కింద అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన అనేక ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించారు. ముఖ్యంగా, సంప్రదాయ చేనేతల కోసం ఆధునిక మగ్గాల ఏర్పాటు, చిన్న చేనేత క్లస్టర్ల అభివృద్ధి, అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణానికి కేంద్రం నుండి నిధుల కేటాయింపు కోరారు. అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ,విలేజ్ మరియు అర్బన్ హట్లు ను ఏర్పాటు చేసి హస్తకళలను అభివృద్ధి పరచాలని కోరారు
ఈ సమావేశంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని కొత్త టెక్స్టైల్ పథకాలు మంజూరు చేయాలని, ఇప్పటికే ఆమోదితమైన ప్రాజెక్టుల నిధులు త్వరగా విడుదల చేసి, పనులు వేగంగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రిత్వశాఖను కోరారు.