Re-survey: మూడేళ్లలో సమగ్రంగా భూముల రీ సర్వే పూర్తి
Andhra pradesh to present budget for 2025-26
Ap budget 2025 26 telugu
AP Budget pdf
AP Budget Highlights
Ap Budget portal
Ap Finance Budget
Ap Budget
By
Peoples Motivation
Re-survey: మూడేళ్లలో సమగ్రంగా భూముల రీ సర్వే పూర్తి
ప్రస్తుతం మండలానికో గ్రామంలో రీ సర్వే
గత ప్రభుత్వంలో బొమ్మలు వేసుకోవాలనే పిచ్చితో తప్పులతడకగా రీసర్వే
6688 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాం
2.79 లక్షల ఫిర్యాదుల స్వీకరణ
90 శాతం ఫిర్యాదుల పరిష్కారం
శాసనసభలో రాష్ర్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):- గత ప్రభుత్వంలో తప్పుల తడకగా సాగిన భూముల రీ సర్వేను సరిదిద్దుతున్నామని, తమ ప్రభుత్వం తిరిగి ప్రారంభించిన రీ సర్వేలో ఎలాంటి తప్పులకు అస్కారం లేకుండా చాలా పకడ్బందీగా కొనసాగిస్తున్నామని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఎలాంటి హడావిడి లేకుండా భూయజమానులందర్నీ ఒప్పించి ప్రతిష్టాత్మకంగా రీ సర్వే ప్రాజెక్ట్ ను మూడేళ్ల సమయంలో పూర్తి చేస్తామని చెప్పారు. జనవరి 20వ తేదీన తమ ప్రభుత్వం భూముల రీ సర్వేను తిరిగి ప్రారంభించిందని, అయితే ఈసారి ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ గా ఎన్నుకొని రీ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామాన్ని బ్లాకులుగా విభజించి, ప్రతి బ్లాక్ కు అధికారులను కేటాయించి రోజుకు 20 ఎకరాల మేరకే రీ సర్వే చేయిస్తున్నామని చెప్పారు. రీ సర్వే చేసే ముందు ఆ భూమికి సరిహద్దులో ఉన్న భూ యజమానులందరికీ నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే రీ సర్వే చేస్తున్నారని చెప్పారు. ఒక బ్లాక్ లో ఉన్న భూ యజమానులందరికీ వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి అందరికీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నామని చెప్పారు. శాసనసభలో మంగళవారం ప్రశోత్తరాల సమయంలో భాగంగా రీ సర్వే అంశంపై టీడీపీ సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, కూన రవికుమార్, బోనెల విజయచంద్ర, రాజగోపాల్ అడిగిన ప్రశ్నలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ కాలంలో 6688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారని, కానీ ఆ రీ సర్వే అంతా తప్పుల తడకగా మారిందన్నారు. రీ సర్వేకు సంబంధించి భూ యజమానులకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని, రీ సర్వే పూర్తయిన తర్వాత భూ యాజమానులు అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజులగా ఉన్న గడువును 21 రోజులకు కుదించారన్నారు. నిబంధనల ప్రకారం కాకుండా సరిహద్దు రాళ్లపైన తమ బొమ్మలు వేసుకోవాలనే పిచ్చితో హడావిడిగా రీ సర్వే చేశారన్నారు. పాస్ పుస్తకాలపైన తన బొమ్మలు వేసుకోవాలనే పిచ్చి తప్ప రీ సర్వేను సక్రమంగా చేయాలనే ఆలోచన అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వానికి లేదన్నారు. దీంతో భూ విస్తీర్ణం, సరిహద్దు, పేర్లు దిద్దుబాటు, భూ వర్గీకరణ సమస్యలపైన భూ యజమానులు అసంతృప్తివ్యక్తం చేశారు. వీటన్నింటీని సరి చేసేందుకు కూటమి ప్రభుత్వం రీసర్వే పూర్తయిన అన్ని గ్రామాల్లోనూ గ్రామ సభలు నిర్వహించి అర్జీలు స్వీకరించిందని చెప్పారు. వీటికి సంబంధించి దాదాపు 2,79,712 అర్జీలు రాగా 2,57,881 అర్జీలను పరిష్కరించామని, మిగిలిన 21,831 అర్జీలలను మార్చి 31లోగా పరిష్కరిస్తామని చెప్పారు. వచ్చిన అర్జీల్లో విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు సంబంధించి 99,216 అర్జీలు రాగా 89,473 అర్జీలను పరిష్కరించామని, జాయింట్ ఎల్పీఎమ్(ల్యాండ్ పార్శిల్ మ్యాప్) సమస్యపై 64,441 అర్జీలు రాగా 57,527 అర్జీలను పరిష్కరించామని, పేర్లు మార్పు, వ్యక్తిగత వివరాలు, భూమి వర్గీకరణ వంటి రెవెన్యూ అంశాలకు సంబంధించి 1,16,055 అర్జీలు రాగా 1,10,881 అర్జీలను పరిష్కరించామని తెలిపారు. జాయింట్ ఎల్పీఎమ్ లలో సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ఒకే ఎల్పీఎమ్ లో వేర్వేరు భూ యజమానులు ఉండడంతో వారిని వ్యక్తిగత ల్యాండ్ పార్సిల్స్ గా సబ్ డివిజన్ చేసేంత వరకు వారు తమ ఆస్తులను మ్యుటేషన్ లేదా రిజిస్ర్టేషన్ చేయించడానికి ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు. జాయింట్ ఎల్పీఎమ్ లను విడగొట్టి రిజిస్ర్టేషన్ కు అనుకూలంగా మార్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సబ్ డివిజన్ సిటిజన్ సర్వీసులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. సబ్ డివిజన్ చేసుకునే భూ యజమానులకు 01.01.2025 నుండి ఆరు నెలల పాటు ఫీజు నుండి మినహాయింపు నిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు సబ్ డివిజన్ కోసం 71,337 దరఖాస్తులు రాగా 62,816 దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. 22 ఏ 1(సి)లో పెట్టిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘం సిఫార్సులతో ఈ భూములపై తగిన నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
Comments
