Shakti app: శక్తి మొబైల్ యాప్ ... ఆపద వేళల్లో మహిళలకు సేఫ్
Shakti app: శక్తి మొబైల్ యాప్ ... ఆపద వేళల్లో మహిళలకు సేఫ్
మహిళలు ఈ శక్తి యాప్ సేవలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి
-- జిల్లా ఎస్పీ పి.జగదీష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న శక్తి మొబైల్ యాప్ ను ప్రతి మహిళ తమ మొబైల్ ఫోనులో డౌన్లోడు చేసుకొని తప్పనిసరిగా రిజిస్ట్రేషను చేసుకోవాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ విజ్ఞప్తి చేశారు. ఆపద సమయాలలో మహిళలకు ఈ యాప్ కుటుంబ సభ్యుల్లా ఎంతో సహాయపడుతుందన్నారు. ఆపద వేళల్లో శక్తి యాప్ లోని ఎస్.ఓ.ఎస్. బటన్ ను ప్రెస్ చేసినట్లయితే క్షణాల్లో పోలీసు బృందం మీరున్న ప్రాంతానికి చేరుకొని రక్షణగా నిలుస్తారన్నారు. మహిళల భద్రతకు పోలీసుల సేవలను సులువుగా పొందేందుకు... వారికి అవసరమైన రక్షణ చట్టాలను, పోలీసు స్టేషను ఫోను నంబర్లు, మొబైల్ యాప్ నుండే ఫిర్యాదు చేసే అవకాశం, నైట్ షెల్టర్ల వివరాలను, ఫ్యామిలికౌన్సిలింగు, సేఫ్ ట్రావెల్, వాట్సాప్ గవర్నెన్స్ సేవలను శక్తి మొబైల్ యాప్లో నిక్షిప్తం చేసి, మొబైల్ యాప్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిందని జిల్లా ఎస్పీ అన్నారు.
ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణించే యాప్ లోని సేఫ్ ట్రావెల్ ను ఆన్ చేసుకొంటే వారు సురక్షితంగా గమ్య స్థానానికి చేరుకొనే వరకు వారి ప్రయాణంపై పోలీసుశాఖ నిఘా పెడుతుందన్నారు. ఆపద సమయాల్లో సదరు మహిళలు పోలీసులకు సమాచారాన్ని అందించలేని పరిస్థితుల్లో కూడా ఈ మొబైల్ యాప్ పని చేస్తుందన్నారు. అటువంటి సమయాల్లో కేవలం మొబైల్ ఫోనును గాలిలో షేక్ చేస్తే వారున్న లొకేషను, 10 సెకన్ల ఆడియో, వీడియోలు దగ్గరలో ఉన్న పోలీసు స్టేషనుకు చేరుతాయని...తద్వారా పోలీసులు సకాలంలో స్పందించి, కారకులైన వ్యక్తులపై చర్యలు చేపట్టి, వారికి రక్షణగా నిలిచే అవకాశం ఉంటుందన్నారు. కావున, ప్రతీ మహిళ, విద్యార్థిని స్వచ్ఛందంగా తమ మొబైల్ ఫోనులో తప్పనిసరిగా శక్తి యాప్ ను డౌన్లోడు చేసుకొని, రిజిస్ట్రేషను చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. మహిళలు, విద్యార్థినులు తాము ఆపదలో ఉన్నామని భావిస్తే యాప్లోని ఎస్.ఓ.ఎస్. బటన్ ప్రెస్ చేయాలన్నారు. రాత్రి సమయాల్లో మహిళలు నైట్ షెల్టర్లులో వేచి ఉండేందుకు దగ్గరలో ఉన్న నైట్ షెల్టర్ల వివరాలు, సమీపంలోని పోలీసు స్టేషన్లు ఫోను నంబర్లు, హెల్ప్ లైను నంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఏదైనా తమకు ఎదురైన సమస్యలుపై ఫిర్యాదు చేయాలనుకుంటే పోలీసు స్టేషన్ కే వెళ్లాల్సిన అవసరం లేదని... ఈ యాప్ లో ఫిర్యాదు చేస్తే చాలు సకాలంలో పోలీసు సేవలు అందుతాయన్నారు.
శక్తి బృందాలు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను, బస్టాండులు, ఆర్టీసి కాంప్లెక్సులు, రైల్వేస్టేషన్లు, ముఖ్య కూడళ్ళు, కళాశాలలు సందర్శించి, మహిళలు, విద్యార్ధినులకు శక్తి మొబైల్ యాప్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఈ బృందాలకు ఎస్ఐలు నాయకత్వం వహిస్తున్నారని, శక్తి టీమ్స్ మఫ్టీలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, యాప్ పనితీరు పట్ల అవగాహన చేస్తున్నారన్నారు.