₹500 నకిలీ కరెన్సీ ఇలా గుర్తించండి?
₹500 నకిలీ కరెన్సీ ఇలా గుర్తించండి?
చట్టాలు ఎంత కఠినంగా మారుతున్న, ఎంత టెక్నాలజీ పెరుగుతున్న నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు సైబర్ నేరాల ద్వారా ప్రజల ఖాతాలను లూటీ చేస్తున్న కేటుగాళ్లు మరొకవైపు నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద ఎత్తున నకిలీ రూ. 500 నోట్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ మాట చెబుతోంది మరెవరో కాదు సాక్ష్యాత్యు కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ ఈ నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ మహిళ.. స్థానికంగా మహిళా గ్రూప్ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల గ్రూప్ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసి బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లింది. అందులో నకిలీ రూ. 500 నోటును గుర్తించిన బ్యాంకు అధికారులు మందలించి, ఆ నోటును చించి పడేశారు. దీంతో సదరు గ్రూప్ లీడర్ ఆ రూ. 500 నష్టపోవాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో నకిలీ రూ. 500 నోట్ల సర్క్యులేషన్ పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే కేంద్ర హోం శాఖ ప్రజలను అలర్ట్ చేసింది. రూ.500 నోట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సీబీఐ, సెబీ, ఎన్‌ఐఏ, ఎఫ్‌ఐయూ, డీఆర్‌ఐకి కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. మార్కెట్లోకి కొత్తగా వస్తున్న నకిలీ నోట్ల ప్రింటింగ్‌ను కేటుగాళ్లు చాలా నాణ్యతతో చేస్తున్నారు. చాలావరకు ఒరిజినల్ నోటు లాగానే ఉంటున్నాయని, వాటిని గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఒరిజినల్ నోటులో ఉండే గుర్తులన్నీ ఉండేలా నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. దీంతో సామాన్యులు తేడాను గుర్తించడం అసాధ్యంగా మారుతోంది. నకిలీ నోట్లు మార్కెట్లోకి రావడం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ రూ. 500 వంటి పెద్ద నోట్లు మార్కెట్లోకి పెద్ద ఎత్తున వస్తే అది ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నకిలీ నోటును ఇలా గుర్తించండి:
అయితే అన్నింటినీ పక్కాగా ఉండేలా చూసుకున్న కేటుగాళ్లు ఓ విషయంలో మాత్రం తప్పు చేశారని హోం శాఖ తెలిపింది. నకిలీ నోట్లలో ఓ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్లు గుర్తించారు. "RESERVE BANK OF INDIA" అనే పదంలో తప్పు దొర్లిందని తెలిపింది. "RESERVE" అనే పదంలో "E" బదులు "A" పడిందని వెల్లడించింది. ఈ తేడాను గుర్తించడం ద్వారా మాత్రమే నకిలీ నోటును గుర్తించవచ్చని చెబుతున్నారు. అందుకే చేతులోకి రూ. 500 నోటు వచ్చిన వెంటనే దానిని ఒకసారి క్షుణ్నంగా గమనించాలని అధికారులు చెబుతున్నారు.