సాయిరెడ్డి సొంత ఛానెల్ పేరు ఇదేనా?
సాయిరెడ్డి సొంత ఛానెల్ పేరు ఇదేనా?
రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సొంత మీడియా వ్యవహారాలు కొలిక్కి వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బ్రాడ్ కాస్టింగ్ పనులపై ఆయన బిజీబిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్-బెంగళూరు-ఢిల్లీ అంటూ.. వారం వారం ఆయన చక్కర్లు కొడుతున్నారు. గతంలో ఓ కీలక ఛానెల్‌లో సీఈవోగా చేసిన వ్యక్తితో సంప్రదింపులు జరుగుతున్నాయని మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ ఏడాది దసరా నాటికి ‘వి-టీవీ’ పేరుతో సంస్థను స్థాపించే అవకాశం ఉందని కూడా మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఫండింగ్ వ్యవహారాలు.. ఉత్తరాదికి చెందిన ఓ వ్యాపార వేత్త చూస్తున్నారని.. ఆయనకు కూడా భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. గత ఏడాది తను సొంతగా మీడియా పెడతానంటూ.. సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. ఆయన అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు.
కానీ, తర్వాత.. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకొని.. వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో సొంత చానెల్ వ్యవహారం కూడా ఆగిపోయిందని అనుకున్నారు. అదే సమయంలో రాజకీయాల నుంచి కూడా సాయిరెడ్డి విరమించుకున్నారన్న చర్చ జరిగింది. కానీ.. సాయిరెడ్డిని జాతీయ పార్టీ ఒకటి ఆహ్వానిస్తున్నట్టు వార్తలు రావడంతోపాటు.. తనకంటూ.. ప్రత్యేక వేదిక ఉండాలని కూడా సాయిరెడ్డి భావిస్తున్నారు. సో.. ఇండిపెండెంట్‌గా అయినా.. ఆయన రాజకీయాలు చేసే ఆలోచనలో ఉన్నారు.
దీంతో సొంత ఛానెల్ వ్యవహారాన్ని ఆయన నిలుపుదల చేయలేదని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రీ-చానెల్ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని సమాచారం. అయితే.. దీనిపై పెద్దగా ప్రచారం జరగకుండా సాయిరెడ్డి జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇటీవల ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడినప్పుడు సొంత మీడియా గురించి.. అడగ్గా.. త్వరలోనే అప్‌డేట్ ఉంటుందని వ్యాఖ్యానించి.. జారుకున్నారు. అంతకుమించి ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. సో.. దీనిని బట్టి తెరవెనుక ఏర్పాట్లు ముమ్మరంగానే సాగుతున్నాయని తెలుస్తోంది.