నరమేధానికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఫొటో రిలీజ్..
నరమేధానికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఫొటో రిలీజ్..
జమ్మూ కశ్మీర్, అనంతనాగ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను గుర్తించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమైనాయి. అందులోభాగంగా నలుగురు ఉగ్రవాదుల చిత్రాలను బుధవారం విడుదల చేశాయి.
మరోవైపు ఆ దాడిలో పాల్గొన్న మరో ఉగ్రవాది ఫొటోను సైతం ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ ఇప్పటికే లష్కరే తోయిబా ప్రకటించింది. ఆ సంస్థ టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్ ఈ ఘటనకు ప్రధాన సూత్రదారి అని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.అలాగే రావల్ కోట్‌లోని ఇద్దరు వ్యక్తులతో ఈ ఘటనకు ప్రమేయం ఉందని వెల్లడించాయి. ఆ దిశగా నిఘా వర్గాలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి. తొలుత నిఘా వర్గాలు ఊహా చిత్రాలను విడుదల చేశాయి. ఆ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఈ దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల చిత్రాలను విడుదల చేశారు.
మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందగానే విదేశీ పర్యటనలో భాగంగా దుబాయ్‌లో ఉన్న ప్రధాని మోదీ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను అప్రమత్తం చేశారు. దీంతో అమిత్ షా హుటా హుటిన జమ్మూ కశ్మీర్ బయలుదేరి వెళ్లారు. అనంతరం స్థానిక భద్రతపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు సీఎం ఒమర్ అబ్దుల్లాతో సమీక్షించారు. అలాగే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఎరివేతకు యుద్ద ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఇంకోవైపు విదేశీ పర్యటనను అర్థాంతరంగా ముగించికొని ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం జమ్మూ కశ్మీర్ భద్రతపై జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌తోపాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌తో మోదీ అత్యసవరంగా సమావేశమయ్యారు.
ఇంకోవైపు పహల్గాంలో ఈ ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించారు. అంతకుముందు అమిత్ షా.. ఉగ్రదాడిలో మరణించిన 28 మృతదేహాలకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారిని ఓదార్పి.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని బాధిత కుటుంబాలకు కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అదీకాక 2019లో పుల్వామా దాడి అనంతరం జరిగిన అతి పెద్ద ఘటనగా ప్రభుత్వం భావిస్తోంది.