CJI: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం
CJI: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం
సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్..
మే 14న బాధ్యతల స్వీకరణ..
నియామకాన్ని ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ..
సుమారు 6 నెలల పాటు పదవిలో కొనసాగనున్న బీఆర్ గవాయ్..
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రాబోతున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ నేపథ్యంలో, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్) తదుపరి సీజేఐగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.
ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం, మే 14వ తేదీన జస్టిస్ బీఆర్ గవాయ్ భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నియామక విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధికారికంగా ప్రకటించారు. "జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం భారత న్యాయవ్యవస్థకు కీలక ముందడుగు. న్యాయ రంగంలో ఆయన శ్రేష్ఠతకు, నిష్పాక్షికతకు ప్రసిద్ధి చెందారు" అని మేఘవాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అయితే, జస్టిస్ గవాయ్ సీజేఐగా సుమారు ఆరు నెలల పాటు మాత్రమే సేవలందించనున్నారు. ఆయన ఈ ఏడాది నవంబర్ నెలలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. జస్టిస్ గవాయ్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి అత్యున్నత న్యాయస్థానంలో పలు కీలక కేసుల విచారణలో, తీర్పుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు.
జస్టిస్ గవాయ్ నేపథ్యం పరిశీలిస్తే, ఆయన 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. ఆయన తండ్రి దివంగత ఆర్.ఎస్. గవాయ్ ప్రముఖ సామాజిక కార్యకర్తగా, బీహార్, కేరళ వంటి రాష్ట్రాలకు గవర్నర్గా కూడా పనిచేశారు. జస్టిస్ గవాయ్ తన న్యాయ ప్రస్థానాన్ని 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రారంభించారు. అనంతరం 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందడానికి ముందు ఆయన బాంబే హైకోర్టులో ముంబై, నాగ్పూర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో దాదాపు 15 ఏళ్లకు పైగా న్యాయమూర్తిగా సేవలందించారు