GNSS: మే 1 నుంచి ప్రయాణించిన దూరానికే టోల్ చార్జీ..
GNSS: మే 1 నుంచి ప్రయాణించిన దూరానికే టోల్ చార్జీ..
• జీఎన్ఎస్ఎస్ విధానాన్ని తీసుకొస్తున్న కేంద్రం..• తొలుత వాణిజ్య వాహనాలకు, 2027 నుంచి వ్యక్తిగత వాహనాలకు అమలు..• వాహనం వివరాలు తెలుసుకునేందుకు వోయూబీ బిగింపు..
కొత్త జీపీఎస్ ఆధారిత టోల్ విధానంపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే నాగపూర్ లో కీలక ప్రకటన చేశారు. కొత్తటోల్ విధానాన్ని 15రోజుల్లో ప్రకటిస్తామని, మే 1 నుంచి ఇది ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఫాస్టాగ్ స్థానంలో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను (GNSS) తీసుకొస్తామని ప్రకటించారు. అయితే ఇకపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించేలా కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. టోల్ గేట్ల వద్ద నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (జీఎన్ఎస్ఎస్) ఆధారిత విధానం మే 1 నుంచి అమల్లోకి రానుంది. తొలుత వాణిజ్య వాహనాలకు, 2027 నుంచి వ్యక్తిగత వాహనాలకు అమలు చేయనున్నారు. అప్పటి వరకు మాత్రం టోల్ గేట్లు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది.
దేశంలో జాతీయ రహదారులపై టోల్ ఫీజుల వసూళ్ల విధానంలో కీలక మార్పు రానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫాస్టాగ్ వ్యవస్థ స్థానంలో, GPS ఆధారిత టోల్ వసూళ్ల విధానం (GNSS) ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మార్పు వాహనదారులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది. GNSS అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది ఉపగ్రహాల ద్వారా వాహనాల స్థానాన్ని ట్రాక్ చేసి, ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజును లెక్కించేందుకు ఉపయోగించే టెక్నాలజీ. ఈ విధానం ద్వారా టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, ఆటోమేటిక్‌గా టోల్ వసూళ్లు జరుగుతాయి..
సాధారణంగా మన ఫోన్లలో ఉండే జీపీఎస్ విధానానికి ఈ జీఎన్ఎస్ఎస్ పూర్తిగా భిన్నం. జీపీఎస్ అనేది ఒకే ఒక్క శాటిలైట్ నేవిగేషన్ వ్యవస్థ. కానీ జీఎన్ఎస్ఎస్ అనేది పలు దేశాలకు చెందిన నేవిగేషన్ ఉపగ్రహాలతో అనుసంధానమవుతుంది. రష్యాకు చెందిన గ్లోనాస్, యూరప్‌కు చెందిన గెలీలియో, చైనాకు చెందిన బైదు, భారత్‌కు చెందిన గగన్, నావిక్ తదితర నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ వేర్వేరు ఉపగ్రహాలకు ఒకేసారి అనుసంధానమై అత్యంత కచ్చితమైన లొకేషన్ గుర్తింపుతోపాటు నావిగేషన్ పొందే విధానమే జీఎన్ఎస్ఎస్.
జీఎన్ఎస్ఎస్ అంటే ఏమిటి?
ఫాస్టాగ్ స్థానంలో రానున్న గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) సాంకేతికతను ఉపయోగించి, వాహనాలు రహదారిపై ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఛార్జీలను ఆటోమేటిక్‌గా వసూలు చేస్తుంది. దీని వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన పనిలేదు. ఫలితంగా ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది. 2016లో తీసుకొచ్చిన ఫాస్టాగ్ స్థానంలో జీఎన్ఎస్ఎస్ను తీసుకురానున్నారు. అయితే ఫాస్టాగ్ వచ్చిన తర్వాత టోల్ వసూళ్లు వేగంగా జరిగేవి. కానీ టోల్ ప్లాజాలలో సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల కొన్నిసార్లు ఆలస్యం అయ్యేవి. దీంతో హైవేపై వాహనాలు బారులు తీరి వావానదారులు ఇబ్బందిపడేవారు. ఈ క్రమంలో ఫాస్టాగ్ స్థానంలో జీఎన్ఎస్ఎస్ను తీసుకొస్తున్నారు.
ప్రస్తుతం జీఎన్ఎస్ఎస్ అమలు..
ప్రస్తుతం, జీఎన్ఎస్ఎస్ వ్యవస్థను పలు జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఉదాహరణకు కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు జాతీయ రహదారి (NH-275), హర్యానాలోని పానిపట్-హిసార్ జాతీయ రహదారి (NH-709) వంటి మార్గాల్లో GNSS వ్యవస్థను అమలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మే 1 నుంచి దేశవ్యాప్తంగా GNSS వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మార్పు ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎదురుచూసే సమయం ఉండదు. దీంతో వాహనదారుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.
జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ఫాస్టాగ్ లానే జీఎన్ఎస్ఎస్ కూడా RFID టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ ట్యాగ్ను విండ్ షీల్డ్పై ఉంచాలి. ఆ తర్వాత జీఎన్ఎస్ఎస్ శాటిలైట్ ద్వారా వాహన కదలికలను ట్రాక్ చేస్తుంది. దీంతో వాహనం ప్రయాణించిన దూరం ఆదారంగా టోల్ రుసుము వసూల్ అవుతుంది. జీఎన్ఎస్ఎస్ ఆధారంగా మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అవుతుంది. కొత్త టోల్ విధానంలో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ బిల్లింగ్ ఆప్షన్లు ఉంటాయని భావిస్తున్నారు.
జీఎన్ఎస్ఎస్ వల్ల లాభాలు?
ఫాస్టాగ్ స్థానంలో రాబోయే కొత్త టోల్ విధానం ద్వారా మీరు ప్రయాణించే దూరానికే టోల్ రుసుము పడుతుంది. కొత్త టోల్ వ్యవస్థ వచ్చిన తర్వాత టోల్ ప్లాజాలను తొలగిస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. దీంతో హైవేపై సుఖవంతమైన ప్రయాణం చేయవచ్చు. ట్రాఫిక్ తగ్గడం వల్ల వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది. కొత్త టోల్ వసూలు వ్యవస్థను ప్రారంభ దశలో ట్రక్కులు, బస్సులు వంటి వాణిజ్య వాహనాలకు అమలు చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) భావిస్తోంది. ఆ తర్వాత దశలో ప్రైవేట్ వాహనాలను ఇదే విధానంలో చేర్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.