రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 2కోట్ల మంది భాగస్వాములు కావాలి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 2కోట్ల మంది భాగస్వాములు కావాలి


అమరావతి,19 మే:జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి వరకూ జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో కనీసం 2 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ పిలుపునిచ్చారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం,వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి స్టేట్ ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ (ఎస్పిఎంజి),అన్ని కోర్టు కాంప్లెక్సుల్లో మరుగు దొడ్లు నిర్మాణం తదితర అంశాలపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి సంబంధిత శాఖల కార్యదర్శులు,జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో సమావేశం నిర్వహించారు.ముందుగా జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల గురించి సిఎస్ మాట్లాడుతూ విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సమక్షంలో జరిగే ప్రధాన వేదిక వద్ద 5లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొని యోగాసనాలు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి వరకు నిర్వహించే యోగా దినోత్సవ వేడుకల్లో కనీసం 2కోట్ల మంది భాగస్వాములయ్యేలా చూడాలని కలెక్టర్లును ఆదేశించారు.దైనందిన జీవితంలో ఆరోగ్య పరిరక్షణకు యోగా ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు కృషి చేయాలని ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడకుల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం సర్కులర్ ఆదేశాలు, జిఓలను జారీ చేయడం జరుగుతుందని సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు.

స్టేట్ ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ గురించి మాట్లాడుతూ 50 కోట్ల రూపాయలు పైబడిన ఇన్పప్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు,క్లియరెన్సులు తదితర అంశాలను ఈఎస్పిఎంజి మానిటరింగ్ గ్రూప్ పర్యవేక్షిస్తుందని తెలిపారు.ఇందుకు సంబంధించి ఇది తొలి సమావేశమని ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించడం జరుగుతుందన్నారు.జిల్లా కలెక్టర్లు భూ సంబంధిత అంశాల తోపాటు ఇతర సమస్యలను గుర్తించి సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు.ముఖ్యంగా ఇంటర్ డిపార్టుమెంటల్ కోఆర్డినేషన్ ద్వారా ఆయా ప్రాజెక్టుల పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని కార్యదర్శులు,కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు.

దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని కోర్టు కాంప్లెక్సుల్లో మూడు మాసాల్లోగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని జిల్లా కలక్టర్లను సిఎస్ విజాయనంద్ ఆదేశించారు.ఇందుకు సంబంధించి ఇప్పటికే సుమారు 50 కోట్ల రూ.ల పనులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.ఆయా పనులను అత్యంత ప్రాధాన్యతా క్రమంలో వేగవంతంగా పూర్తి చేయాలని కలక్టర్లను ఆదేశించారు.

ఈసమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణ రాష్ట్రస్థాయి పర్యవేక్షణ నోడలు అధికారి యం.టి.కృష్ణబాబు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.2023లో గుజరాత్ రాష్ట్రం సూరత్ లో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఒకే ప్రాంతంలో లక్షా 53వేల మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించగా ఆవేడకల్లో మొత్తం కోటి 25 లక్షల మంది భాగస్వాములు అయ్యారని తెలిపారు.కాగా జూన్ 21న విశాఖ ఆర్కె బీచ్ లో నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ప్రధాన వేదిక వద్ద ప్రత్యక్షంగా 5లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 2కోట్ల మంది భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాల్సి ఉందన్నారు.ఈఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని”Yoga for One Earth, One Health’ అనే నినాదంతో యోగాపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈనెల 21 నుండి జూన్ 21 వరకూ నెల రోజులపాటు ప్రతి ఒక్కరూ యోగాను ఆసరించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర పేరిట ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు.ఈకార్యక్రమాన్ని మూడు దశలుగా చేపట్టనున్నట్టు అనగా ఈనెల 21 నుండి 27 వరకూ ప్రాధమిక దశ కింద ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణ,28 నుండి జూన్ 3 వరకూ మండల స్థాయిలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ,జూన్ 4 నుండి 16వరకు గ్రామ,వార్డు స్థాయిల్లో శిక్షణ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈనెల 21న అన్నిజిల్లాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి కనీసం 10 వేల మంది ప్రజాప్రతినిధులు, యోగా శిక్షకులు,పిఇటిలు,యోగా అబ్యాసకులు తదితరులతో కర్టెన్ రైజర్ ఈవెంటను నిర్వహించాలని సూచించారు.ఈనెల 27న సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్లతో సమావేశమై వారి భాగస్వామ్యంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని చెప్పారు.జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా 100 పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఈసమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా, పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్,ఐఅండ్ఐ శాఖ కార్యదర్శి డా.ఎన్. యువ రాజ్,న్యాయ శాఖ కార్యదర్శి ప్రతిభా దేవి,ఐఅండ్పిఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్ల పాల్గొన్నారు.అలాగే పలువురు కార్యదర్శులు,జిల్లా కలెక్టర్లు వర్చువల్ గా పాల్గొన్నారు.

Comments

-Advertisement-