20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
కర్నూలు జిల్లా గుట్టపాడు గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించిన మంత్రి టి.జి భరత్
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడు గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కును ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి టి.జి భరత్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు చెప్పారు. దీని ద్వారా ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమలు వస్తాయని.. తద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. స్థానికులకు ఉద్యోగాలు లభించేందుకు వీలుగా స్కిల్ డెవలప్ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పరిశ్రమల్లో పనిచేసేందుకు కావాల్సిన నైపుణ్యాలు యువతకు అందిస్తామన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుచేయాలన్న గొప్ప ఆలోచన సీఎం చంద్రబాబుకు వచ్చిందన్నారు. అప్పటి చంద్రబాబు విజన్‌తో ఇప్పుడు హైదరాబాద్ ఎంతో ఎదిగిపోయిందన్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతాయన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగితేనే ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రజలందరూ తమపై నమ్మకం పెట్టుకోవాలని ఆయన చెప్పారు. ఓర్వకల్లు పారిశ్రామికవాడలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. దూపాడు నుండి బేతంచర్ల వరకు ఓర్వకల్లు నోడ్ మీదుగా రైల్వే సైడింగ్ కోసం ఇటీవల కేంద్ర రైల్వే మంత్రిని కలిసి వివరించానని మంత్రి టి.జి భరత్ తెలిపారు. అంతేకాకుండా పరిశ్రమలకు నీరు అందించడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే 14 వేల కోట్లతో సెమీ కండక్టర్ పరిశ్రమ ఓర్వకల్లులో పెట్టేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. దీంతో పాటు ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టు కూడా వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ కృషితోనే ఇదంతా సాధ్యమవుతుందన్నారు.
ఓర్వకల్లులో జైరాజ్ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమ గతంలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రారంభమైందన్నారు. టిడిపి ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ సమయానికి పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభమవ్వడంతో పాటు పరిశ్రమ విస్తరణ కూడా జరిగి ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటర్ పైప్ లైన్ వర్క్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. త్వరలో ఇది పూర్తవుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో 9 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని.. వీటి ద్వారా ఐదున్నర లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టిటిడి బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ గౌడ్, గుట్టపాడు సర్పంచ్ మోహన్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.