నిడదవోలు మెగా జాబ్ మేళాలో 2000కు పైగా ఉద్యోగాల కల్పన
నిడదవోలు మెగా జాబ్ మేళాలో 2000కు పైగా ఉద్యోగాల కల్పన
- త్వరలో మరిన్ని జాబ్ మేళాల నిర్వహణ
- ప్రతి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు: రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ యువతకు భరోసానిచ్చారు.
శుక్రవారం నిడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వికాస జేకేసీ సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన మెగా జాబ్ మేళా కు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నేడు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు దాదాపు 42 కంపెనీలు హాజరయ్యాయని , ఆయా కంపెనీల్లో 2000కు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశముందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న జాబ్ మేళాలో ఐటీ రంగానికి చెందిన కంపెనీలు అధికంగా వచ్చాయని, తదుపరి విడతలో జరిగే జాబ్ మేళాలో టూరిజం, అతిథ్య రంగాలకు సంబంధించిన కంపెనీలను ఆహ్వానిస్తామన్నారు. అప్పుడు హోటల్, హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ చదివిన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ మధ్య కాలంలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ టూరిజం కోర్సులు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. యువత వద్దకే ఉద్యోగాలు తెచ్చేందుకు జిల్లా పరిధిలో వికాస సంస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. మెగా జాబ్ మేళాలు యువతకు సువర్ణావకాశంగా అభివర్ణించారు. పీఎం, సీఎం, డిప్యూటీ సీఎంలు యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించామని గుర్తుచేశారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల మంది యువత కు ఉద్యోగాల కల్పన కోసం ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. జాబ్ మేళాకు హాజరైన వారిలో ఎవరికైనా ఉద్యోగం దొరకకపోతే నిరాశ చెందవద్దని, రాబోయే రోజుల్లో నైపుణ్యం పెంచే విధంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అంశంపై మంత్రి నారాలోకేష్ ప్రత్యేక శ్రద్ధ వహించారని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని తెలిపారు.గత ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆశపెట్టి ఓట్లు దండుకొన్నదని, కానీ ఐదేళ్ల కాలంలో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు.
కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పేందుకు తద్వారా ఉద్యోగాల సాధనకు యువత కోసం ఆన్ గోయింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వికాస సంస్థను కోరానని, అందుకు వారు టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి మల్టీ నేషనల్ కంపెనీలతో చర్చించి శిక్షణను ఇచ్చే వారిని తీసుకువస్తామన్నారు. శిక్షణ కార్యక్రమం కోసం తాము వసతి సౌకర్యం కల్పిస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. నిరుద్యోగ యువత భవిష్యత్ నిర్మాణంలో, జీవితంలో స్థిరపడేందుకు తాము వెన్నంటే ఉంటామని హామీనిచ్చారు.ప్రతి ఒక్క యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. అవకాశాలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని భరోసానిచ్చారు. రాజకీయ నాయకత్వం అనేది యువతను సరైన మార్గంలో పెట్టేందుకు ప్రేరేపిస్తుందన్నారు. ఈ క్రమంలో యువత ఉద్యోగంతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. అందుకు ఉదాహరణ సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పరిపాలన సాగిస్తున్న తీరును వివరించారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న జాబ్ మేళాలో అన్ని రకాల విద్యార్హతలకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలున్నాయన్నారు. ప్రత్యేకించి ఐటీ, ఐటీఎస్, ఫార్మా, మార్కెటింగ్, టెక్నికల్,నిర్మాణ రంగానికి సంబంధించిన అంశాల్లో ఉద్యోగాల భర్తీకి అవకాశమున్నట్లు వక్తలు తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులందరికీ మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేస్తామని పేర్కొన్నారు. 1989లో ఏర్పాటు చేసిన వికాస ద్వారా ఇప్పటివరకు దాదాపు 2 లక్షలకు పైగా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని వివరించారు. ఇటీవలే తమకు కూటమి ప్రభుత్వం ద్వారా బెస్ట్ ఎంప్లాయిమెంట్ అవార్డు అందించారు. కేంద్ర ప్రభుత్వం నుండి స్కోచ్, గోల్డెన్, ప్లాటినం తదితర అవార్డులు దక్కా యన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్యం పెంచే శిక్షణా కార్యక్రమాలను సైతం అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు.
మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించి తీరుతామన్నారు.
కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, వికాస పీడి కె.లచ్చారావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జీవీడి మురళి, మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బూరుగుపల్లి శేషారావు, ఎస్వీఆర్ కే బాలుర కళాశాల ప్రిన్సిపల్ డా. కె.జ్యోతి, ఎస్వీడీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డా. రుద్ర, కూటమి నాయకులు పి. నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.