నేటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ
నేటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అలాగే కుటుంబంలో కొత్తగా పెళ్లయిన వారికి, వేరుగా ఉంటున్న వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా దరఖాస్తులు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అదనపు కుటుంబ సభ్యులు ఉన్నా, చిరునామా మార్పు జరిగినా కార్డులో మార్పుచేర్పులకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. మృతుల పేర్ల తొలగింపు సహా 6 రకాల అంశాలపై రేషన్ కార్డులో మార్పుచేర్పులకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. మంగళవారం సాయంత్రం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.• 6 అంశాలతో మార్పుచేర్పులకు అవకాశం
• గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అందించవచ్చు
• జూన్ నెలలో స్మార్ట్ కార్డుల జారీ
• వచ్చే వారం నుంచి వాట్సప్ వేదికగానూ సేవలు
• ఈ ఏడాది స్కూళ్లు, హాస్టల్ పిల్లలకు సన్నబియ్యంతో భోజనం
• అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
• రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘గత సంవత్సరం ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ మూలంగా రేషన్ కార్డుల పంపిణీ నిలిపివేశారు. తర్వాత గౌరవ సుప్రీంకోర్టు రేషన్ కార్డులకు తప్పనిసరిగా ఈకేవైసీని అనుసంధానం చేయాలనే సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమంపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఈకేవైసీ నమోదులో మనం ముందంజలో నిలిచాం. అందరినీ ఈకేవైసీకి ప్రోత్సహిస్తూ, ఈ పాస్ యంత్రాలతోనే ఈకేవైసీని నమోదు చేశాం. రికార్డు స్థాయిలో ఇప్పటివరకు 94.04 శాతం పూర్తి చేయగలిగాం.
రాష్ట్రం మొత్తం మీద 1,46,21,223 రేషన్ బియ్యం కార్డులున్నాయి. జనాభాపరంగా రాష్ట్రంలో 4,24,09,028 మంది ఈ రేషన్ కార్డుల్లో నమోదు చేసుకున్నాం. ఈకేవైసీ నమోదును 5 సంవత్సాలలోపు వయసున్న పిల్లలకు, 80 సంవత్సరాలు వయసు పైబడిన వారికి అవసరం లేదని గౌరవ కోర్టు చెప్పిన దాని ప్రకారం 6,45,767 మందికి ఈకేవైసీ నుంచి తొలగించాం.
• నరేంద్ర మోదీ స్ఫూర్తితో కొత్త కార్యక్రమం
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రం పేదలకు ఇచ్చే గ్యాస్ రాయితీలో అనర్హత ఉన్న వారు ఉంటే దానిని స్వచ్ఛందంగా వదులుకోవాలని ఇచ్చిన పిలుపు మేరకు దేశమంతటా వేలాది మంది ముందుకు వచ్చి తమకు రాయితీ అవసరం లేదని ప్రకటించారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోనూ ఓ కార్యక్రమం మొదలుపెడుతున్నాం. రైస్ కార్డు అవసరం లేని వారు ఎవరైనా ఉంటే, వారు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి తమ కార్డును అప్పగించాలని కోరుతున్నాం. అలాగే వలసదారులు తమకు బియ్యం కార్డు వద్దు అని ప్రభుత్వానికి కార్డు సరెండర్ చేస్తే, వారికి గోధుమలు ఇచ్చే విధంగానూ తగిన అవకాశం కల్పిస్తాం. ప్రస్తుతం 6 సర్వీసులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కార్డుల్లో మార్పుల కోసం వచ్చిన దరఖాస్తులు 3,27,809 అందాయి. వీటితోపాటు రేపటి నుంచి అందే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటాం.
• ప్రజలకు ఉపయోగపడేలా స్మార్ట్ రేషన్ కార్డు
కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతున్న స్మార్ట్ రేషన్ కార్డులో అన్ని వివరాలు ఉంటాయి. దీనిలోనే ఉండే క్యూఆర్ కోడ్ లో అన్ని నిక్షిప్తమై ఉంటాయి. తగిన సెక్యూరిటీ ఫీచర్లతో దీన్ని తయారు చేశాం. కార్డు వెనుక కుటుంబ సభ్యుల వివరాలు స్పష్టంగా కనిపించేలా ముద్రిస్తాం. ప్రభుత్వ పాలకుల చిత్రాలు లేకుండా, కేవలం ప్రజలకు ఉపయోగపడేలా మొదటిసారి ఈ కార్డును తయారు చేశాం.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే గత 6 నెలల కార్డు హిస్టరీ మన ముందుంటుంది. రాష్ట్ర డేటా బేస్ కు డైరెక్టుగా లింకు అవుతుంది కాబట్టి, కార్డులో ఏమైనా మార్పులు ఉంటే ఆటోమేటిక్ గా మారుతాయి. దీంతో రేషన్ కార్డులో మార్పులు చేర్పులు సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది.
• ఈ నెల అంతా దరఖాస్తులు తీసుకుంటాం
రైస్ కార్డుల దరఖాస్తులకు, 6 సర్వీసులకీ ఒక నెల మొత్తం కేటాయిస్తాం. ప్రజలకు దరఖాస్తులు స్వీకరించేలా సిబ్బందిని ఆదేశాలు జారీ చేశాం. ప్రతి ఒక్కరూ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు ఇవ్వవచ్చు. వచ్చే వారం నుంచి స్మార్ట్ గవర్నెన్స్ లో భాగంగా వాట్సప్ ద్వారా కూడా 6 రకాల సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే సోమవారం నుంచి వాట్సప్ ద్వారా కూడా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, తొలగించడం వంటివి స్మార్ట్ గవర్నన్స్ లో కూడా చేసుకునేలా అవకాశం కల్పిస్తాం. గతంలో ఉన్న నివేదిక మేరకు రాష్ట్రంలో 4,24,59,028 మంది స్మార్ట్ కార్డుల పరిధిలోకి తీసుకొచ్చేలా జూన్ నెలలో కార్డుల జారీ చేస్తాం. అవుట్ సోర్సింగు ఉద్యోగులను గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగా చూపారు. దీనిపై మా దృష్టికి సమస్య వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించారు.
• అన్నదాతకు అండగా నిలబడతాం
అకాల వర్షాలకు కలిగిన పంట నష్టం మీద క్షేత్రస్థాయి వివరాలను ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సేకరించమన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో నేను పర్యటించాను. దీనిపై సమీక్ష అనంతరం అన్నదాతలను ఎలా ఆదుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. తడిచిన ధాన్యాన్ని మేం కొనుగోలు చేస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వ ఉంటుంది. దీపం – 2 లో భాగంగా 1,50,19,303 మందికి ఇప్పటి వరకు సబ్సిడీ అందించాం. ఈ ఏడాది జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలోని 41 వేల పాఠశాలల్లో, 4 వేల వసతి గృహాల్లో పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం అందించాలని నిర్ణయించాం. 25 కిలోల బ్యాగుల్లో అవసరం మేరకు ప్రతి నెలా బియ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నాణ్యత విషయంలో రాజీ పడబోం. ఆహార భద్రత చట్టం వచ్చిన తర్వాత రేషన్ సరకుల స్థానంలో డీబీటీ ఎంత వరకు ఉపయోగం అనే దానిపై పరిశీలన చేస్తున్నాం. ప్రస్తుతం మాత్రం ప్రజలకు అవసరం అయ్యే ఆహార వస్తువులను అందించేలా ముందుకు వెళ్తున్నాం’’ అన్నారు.