ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
- ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి ఏడాది నర్సులకు అవార్డులందిస్తాం
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సుల సేవలు అద్వితీయం
- చిత్తశుద్ధి, అంకితభావం, కరుణ, సేవ ల కలయికే నర్సింగ్ వృత్తి
- ప్రతి ఒక్కరూ హక్కులతోపాటు బాధ్యతలు తెలుసుకోవాలి
- సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి
చిత్తశుద్ధి, కరుణ, సానుభూతి, మానవత్వం, అంకితభావాలు కలగలిపితేనే నర్సులు అని, ఈ వృత్తిని ఎంచుకున్నందుకు అభినందనలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని సోమవారం తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ నర్సెస్ మరియు మిడ్‌వైవ్స్ కౌన్సిల్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైందని, సేవా భావంతో పనిచేస్తేనే ఆ వృత్తికి న్యాయం చేయగలరని అని అన్నారు. దేశ రక్షణకు సరిహద్దుల్లో సైనికులు ఏవిధంగా పాటుపడతారో నర్సులు కూడా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు తమ సేవలను ఆవిధంగానే అందిస్తున్నారన్నారు. వైద్య రంగంలో పనిచేస్తున్నవారు సైనికులుకన్నా తక్కువేమీ కాదన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా సమయంలో వీరు అందించిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తించుకున్నారన్నారు. రోగులకు చిరునవ్వుతో సేవలందించి వారిని చిరునవ్వుతో ఇంటికి పంపించేలా పనిచేయాలన్నారు. తమ పవిత్ర వృత్తికి న్యాయం చేస్తున్నామా లేదా అనేది ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
నర్సుల సేవలు అనితర సాధ్యమైనవని, నర్సులు సంపదను సృష్టిస్తారని దానికి కారణం మనిషి ఆరోగ్యాన్ని సంరక్షించి వారి జీవిత కాలం పెరగడటమేనన్నారు. సమస్యల పట్ల ఉదాసీనంగా ఉంటే ఫిర్యాదులు వస్తాయన్నారు. ప్రజలకు పటిష్టమైన వైద్యం అందించాల్సిన బాధ్యత మంత్రిగా నాపైన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఉందన్నారు. అందుకోసమే బడ్జెట్ లో వైద్య రంగానికి రూ. 20 వేల కోట్లు కేటాయించారన్నారు. హక్కుల గురించి మాట్లాడుతున్నపుడు బాధ్యతలను కూడా మర్చిపోకూడదన్నారు. ప్రజలకు మేం జవాబుదారీ కాబట్టి బాధ్యతల నిర్వహణపై ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తామని, మానవతా దృక్పధంతో కూడా ఆలోచిస్తామన్నారు. నేను బాధ్యతల గురించి మాట్లాడితే నన్నే ప్రశ్నిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం మానవతా దృక్పధంతో పనిచేస్తుందన్నారు. మా స్థాయిలో మేము సమస్యలు పట్ల సానుకూలంగా ఉంటూ, క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నా, క్షేత్ర స్థాయికి వెళ్లటంలేదనే విమర్శలు చేస్తున్నారన్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదని వారికి కూడా తెలసుసునన్నారు. ఇటీవల ఒక ఉద్యోగి నన్ను బెదిరిస్తూ నాకు కామెంట్ పెట్టారని, అదే గత ప్రభుత్వం అయితే ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించేదన్నారు. నేను అలా చేయలేదని, కాని మేము అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.
ఇటీవల అనంతపురంలో బేబీ మిస్సింగ్ లో మీడియా లో వచ్చిన వార్తలు వల్ల నర్సు మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని, నిజం తెలుసుకుని తర్వాత సరిచేసామన్నారు. ఏపీ లో నర్సింగ్ కౌన్సిల్ లో రాష్ట్ర విభజన తరువాత 1,20,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. గత ప్రభుత్వం చెప్పిన జీరో వేకెన్సీ పాలసీలో డొల్లతన మేం బయటపెట్టామన్నారు. రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ పద్దితిలో 5,300 నర్సింగ్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ప్రతీ సంవత్సరం 2,600 మంది ఇతర దేశాల్లో నర్సింగ్ ఉద్యోగాల కొరకు రిజిష్టర్ చేసుకుంటున్నారన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఎంవోయూ చేసుకుని 8 విదేశీ భాషలు వారికి నేర్పిస్తామన్నారు. దీనివల్ల మన వాళ్లు విదేశాల్లో కూడా నర్సుల ఉద్యోగాల ద్వారా సేవలు అందించే అవకాశం ఏర్పడుతుందన్నారు. సరైన అర్హత లేని నర్సులు ఎక్కడా ఉండకూడదని ఈ విధంగా వృత్తి నైపుణ్యం లో కూడా శిక్షణను అందిస్తామన్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నర్సింగ్ కాలేజీలను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. నర్సింగ్ రిజిస్ట్రేషన్ ను ఆన్ లైన్ లో ఇంటి వద్ద నుంచే నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య రంగంలో పని చేసే వారికి కూడా సమస్యలు ఉంటాయని, వారికి కూడా కుటుంబాలు ఉంటాయని గుర్తించాలన్నారు. 11 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై సంతృప్తి సూచీ 40 శాతం నుంచి 75 శాతానికి చేరిందన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగులను నవ్వుతూ ఆహ్వానించి, వైద్యం అందించి, సంతోషంగా పంపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు పెరిగిపోయాయన్నారు. న్యూరాలజీ సమస్యలు కూడా ఎక్కువగా వచ్చాయన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో ఇంకా కాలేజీల్లో సీట్లు పెరుగుతాయన్నారు. విద్యార్ధుల రిక్వైర్మెంట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళతామన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నర్సింగ్ రంగంలో అత్యంత ప్రతిభ కనబర్చిన ఐదుగురు నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు ఇచ్చామన్నారు. నర్సింగ్ రంగంలో సేవల్ని ప్రోత్సహించేందుకు భవిష్యత్తులోనూ ఈ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. ప్రతి ఏడాది 34 వేల మంది నర్సులు చదువుకుని బయటకు వస్తున్నారన్నారు. ముందుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్ర పటానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, అధికారులు పూలమాలలు అర్పించారు.
మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ డీ.ఎస్.వీ.ఎల్. నర్సింహమ్ మాట్లాడుతూ నర్సుల ఉద్యోగ అవకాశాల్లో మెరుగుదల కోసం విదేశీ భాషల్లో శిక్షణను అందించనున్నామన్నారు. దీనివల్ల గ్లోబల్ గా మన వాళ్లు నర్సుల పోస్టులను అందుకోగలరన్నారు.
కార్యక్రమంలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (అకడమిక్) డాక్టర్ రఘనందనరావు, ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ కే. సుశీల, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డీ. వెంకటేశ్వరరావు, ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జెనీ కెంప్, డిప్యూటీ డైరెక్టర్ (నర్సింగ్) ఎస్. జ్యోతి, నర్సింగ్ కళాశాలల విద్యార్ధినులు తదితరలు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ నుండి అవార్డుల్ని అందుకున్నవారిలో విశాఖపట్నం ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. సత్యవల్లి, విశాఖపట్నం అమెరికన్ ఎన్ఆర్ఐ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిబా ఫ్రాన్సిస్, రేణిగుంట పిహెచ్‌సి ఎంపిహెచ్‌డబ్ల్యు పి. రోహిణి, జంగారెడ్డిగూడెం ఎన్ఎంఎన్ ఏరియా ఆసుపత్రి స్టాఫ్ నర్సు మేడిడి నిరీక్షణ కుమారి, తిరుపతి పద్మావతి నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి. గంగాభవాను లు ఉన్నారు.
