తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా వ్యాధులపై అవగాహన కల్పించాలి
తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా వ్యాధులపై అవగాహన కల్పించాలి
• వ్యాధిగ్రస్తులను ప్రాధమికంగా గుర్తించి చికిత్స అందజేత
• రాష్ట్రంలో 2,100 మంది తలసేమియా పేషెంట్లు
• తలసీమియా, సికిల్ సెల్, అనీమియాలకు ప్రభుత్వం ఉచితంగా స్ర్కీనింగ్
- సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా వ్యాధులు జన్యుపరంగా వచ్చేవని, వీటిపై ఇంకా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుణదల హయత్ ప్లేస్ హోటల్ లో సోమవారం రక్త సంబంధిత వ్యాధుల నిర్ధారణ మరియు చికిత్సలో ఆధునిక పద్ధతులపై రెండు రోజుల శిక్షణ మరియు అవగాహనా (Orientation Training on Advance Modalities in Diagnosis and Treatment of Blood Diseases) కార్యక్రమాన్ని నేషనల్ హెల్త్ మిషన్, హీమోఫోలియా సొసైటీ లు సంయుక్తంగా ఏర్పాటు చేశారు. రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్ర స్థానంలో నిలపాలన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 1900 మంది హిమోఫీలియా బాధితులున్నారని, దాదాపు 2,100 మంది తలసీమియాతో... ఇదే సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నారన్నారు. ఇది జన్యుపరంగా వారసత్వంగా వస్తున్న వ్యాధి అని, దీనికి మందులు వాడుతూనే ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమన్నారు. బాధితుల్ని గుర్తించి వారికి క్రమం తప్పకుండా ఉచితంగా రక్త మార్పిడిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రంలోని 5 ఐసిహెచ్‌యస్ సెంటర్ల (Integrated Centre for Hemoglobinopathy and Hemophilia–ICHH) ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేస్తున్నామన్నారు. వ్యాధి నిర్ణారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స, మందులు అందిస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా వ్యాధులు బారినపడిన వారికి నెలకు రూ. 10 వేల పెన్షన్ కూడా అందిస్తుందన్నారు. రాష్ట్రంలో 40 సంవత్సరాల లోపు ఉన్న గిరిజన ప్రాంతాల్లో ప్రజలు 19 లక్షల మందికి సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ చేయాల్సి ఉండగా 10 లక్షల 50 వేల మందికి ఇప్పటి వరకు స్క్రీనింగ్ చేశామన్నారు, ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని త్వరలోనే దీనిని పూర్తి చేయల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో 19,000 మంది పైగా క్యారియర్స్ ఉన్నారన్నారు. 2,100 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యిందన్నారు. జన్యుపరమైన సికిల్‌సెల్ ఎనీమియా స్క్రీనింగ్ తర్వాత గుర్తింపు కార్డులిస్తున్నామన్నారు. నోడల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించేందుకు రెండు రోజుల పాటు శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఇది కొత్త ఆవిష్కరణలకు దారితీసే విధంగా ఉపయోగపడుతుందన్నారు. తలసీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన కల్పించేందుకు రెండు రోజుల ఓరియెంటేషన్ వైద్యులకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. వైద్య సేవలు మరింత మందికి ఉచితంగా అందించడంతోపాటు లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హీమోఫీలియా మరియు తలసీమియా వ్యాధిగ్రాస్తులకు బ్లీడింగ్ అవుతుందో లేదో తెలియదని, నోడల్ ఆఫీసర్లు పేషెంట్ల పరిస్థితి, వారిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ బ్లీడింగ్ ఆపడానికి అవసరమైన మందులు పేషెంట్ కు ప్రభుత్వం తరపున ఉచితంగా అందించాల్సి ఉందన్నారు. హిమోఫిలియా సోసైటీ, రెడ్‌క్రాస్ సంస్థలు వీటిపై అవగాహన కల్పించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. ఇతర స్వచ్చంద సంస్థలు కూడా ముందుకొచ్చి భాగస్వాములవ్యాలని కోరుతున్నామన్నారు.
తలసీమియా పేషెంట్స్ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తమ సామాజిక బాధ్యతగా ఫండ్ రేజింగ్ కార్యక్రమాన్ని విజయవాడలో చేపట్టారన్నారు. ఇది వారసత్వంగా వచ్చే వ్యాధి అని దీనికి జీవితాంతం మందులు వాడాల్సి ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో మేనరికాల వల్ల సికిల్ సెల్ ఎనీమియా వచ్చే అవకాశం ఉందని, దీనిపై వారిలో అవగాహన కల్పించాలన్నారు. సికిల్ సెల్ అనీమియా తో ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడాటం కోసం వారిని గుర్తించి అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సికిల్ సెల్ అనీమియాతో ప్రాణాలను కోల్పోకూడదన్నారు. జీన్ ఎడిటింగ్ అనే కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తుందన్నారు. మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతో నైపుణ్యం ఉన్న ప్రొఫెసర్లు ఉన్నారని ఎవరికీ తీసిపోని విధంగా తమ సేవలను పేద పేషెంట్ల కోసం వారు వినియోగించాలన్నారు. ముందుగా వ్యాధులపై అవగాహన కోసం ప్రచురించిన పోస్టర్స్ ను మంత్రి రిలీజ్ చేశారు.
కార్యక్రమంలో ఏపీశాక్స్ ఏపీడీ (ఇన్ చార్జ్) డాక్లర్. కామేశ్వర ప్రసాద్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్. ప్రసన్న, స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్. దేవి, హిమోఫీలియా సొసైటీ విజయవాడ చాప్టర్ కార్యదర్శి డాక్టర్ ఎన్బీఎస్వీ ప్రసాద్, సికిల్ సెల్ ఎనీమియా నోడల్ ఆఫీసర్లు, 5 ఐసిహెచ్‌యస్ సెంటర్ల నోడల్ ఆఫీసర్లు, డాక్టర్. రామచంద్రరాజు, డాక్టర్. వైడీ రామారావు, వైద్యులు, తదితరలు పాల్గొన్నారు.