పేదల విద్యకు ప్రభుత్వం అండగా ఉంటుంది
పేదల విద్యకు ప్రభుత్వం అండగా ఉంటుంది
రూ.5.78 కోట్లతో విద్యాలయాలకు నూతన భవనాలు, అదనపు వసతులు
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన జగన్ సర్కార్
- ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
పల్నాడు: పేదల విద్యకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో సోమవారం పర్యటించిన మంత్రి., మాచర్ల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఒక్క పల్నాడు జిల్లా పరిధిలోని సుమారు రూ.5.78 కోట్లతో విద్యాలయాలకు నూతన భవనాలు, అదనపు వసతుల కల్పన పనులకు మంత్రి గొట్టిపాటి భూమిపూజ చేశారు. ముందుగా కారంపూడిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.2.55 కోట్లతో ఏర్పాటు చేయనున్న అదనపు వసతుల పనులకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం దుర్గిలో కేజీబీవీ అప్ గ్రేడ్ జూనియర్ కళాశాలలో రూ.1.51 కోట్లతో నిర్మించే అదనపు భవనాలకు గొట్టిపాటి భూమి పూజ చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో రూ.1.72 కోట్లతో నిర్మించనున్న బాలికల వసతి గృహ సముదాయానికి మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు.
నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల అనంతరం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ... పేదల పక్షపాతి కూటమి ప్రభుత్వమని తెలిపారు. విద్య గొప్పతనాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తున్నామని వెల్లడించారు. ఎంతో కీలకమైన విద్యా వ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని విమర్శించారు. గౌరవ ఉపాధ్యాయ వృత్తిని జగన్ మోహన్ రెడ్డి ఏనాడో అవమానించారని అన్నారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపాలాగా ఉంచిన విషయాన్ని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసి.., దేశంలోనే నెంబర్ 1గా తీర్చుదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.