ఆర్మీ నోటిఫికేషన్ విడుదల.. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం పూర్తి సమాచారం
ఆర్మీ నోటిఫికేషన్ విడుదల.. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం పూర్తి సమాచారం
బీఈ/ బీటెక్ విద్యార్థులకు గుడ్న్యూస్..
• టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు నోటిఫికేషన్ విడుదల..
• ఏడాది పాటు శిక్షణ..
• మొదటి నెల నుంచే రూ.లక్ష జీతం..
బీఈ/ బీటెక్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో సేవలందించే అవకాశం వచ్చింది. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ)ల్లోకి ఇండియన్ ఆర్మీ ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న వారు, ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా ఈ పరీక్షలు రాయొచ్చు. సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూతో నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి శిక్షణ సమయంలో స్టైపెండ్ చెల్లిస్తారు. అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం ఉంటుంది.
దరఖాస్తు రుసుం లేదు : టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) నోటిఫికేషన్ను దాదాపు ప్రతి సంవత్సరం ఆర్మీ విడుదల చేస్తోంది. వీటికి అవివాహిత పురుషులు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి రుసుం లేదు. వచ్చిన దరఖాస్తులను బీటెక్ మార్కుల మెరిట్ ప్రకారం తదుపరి రౌండ్కు ఎంపిక చేస్తారు. తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ), బెంగళూరు కార్యాలయంలో ఐదు రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
వీటిని సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేపడతారు. మొదటిరోజు స్టేజ్-1 స్క్రీనింగ్ (ఇంటలిజెన్స్) పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వారినే స్టేజ్-2కు ఎంపిక చేస్తారు. వీరిని నాలుగు రోజుల పాటు పలు విభాగాల్లో పరీక్షించి, అందులో రాణించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, ట్రైనింగ్కు తీసుకుంటారు. ఇంటర్వ్యూకు హాజరైన వారికి ప్రయాణ ఖర్చులూ చెల్లిస్తారు.
శిక్షణ: కోర్సులోకి ఎంపికైన వారికి ఇండియన్ మిలటరీ అకాడెమీ, డెహ్రాదూన్‌లో జనవరి 2026 నుంచి సుమారు సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిని లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన తర్వాత లెవెల్-10 రూ.56,100 బేసిక్ పేతో పాటు రూ.15,500 మిలటరీ సర్వీస్ పే చెల్లిస్తారు. వీటికి డీఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనంగా ఉంటాయి. అందువల్ల మొదటి నెల నుంచే సుమారు రూ.లక్షకు పైగా జీతం అందుకోవచ్చు.
తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయి హోదాలు సొంతం చేసుకోవచ్చు. 2 ఏళ్ల సర్వీసుతో కెప్టెన్, ఆరేళ్లు కొనసాగితే మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్ కల్నల్ అవుతారు. ఇవి పూర్తికాల పోస్టులు. పదవీ విరమణ వయసు వరకు విధుల్లో కొనసాగవచ్చు. అనంతరం జీవితాంతం పింఛన్ వస్తుంది.
ఖాళీలు : 30 - విభాగాల వారీగా : సివిల్, అనుబంధ విభాగాల్లో 8 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ 6, ఎలక్ట్రికల్ 2, ఎలక్ట్రానిక్స్ అనుబంధ విభాగాల్లో 6, మెకానికల్ 6, ఇతర విభాగాల్లో 2 ఉన్నాయి.
అర్హత : నిర్దేశిత/ అనుబంధ బ్రాంచీల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న వారు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ పోస్టులకు ఎమ్మెస్సీ సీఎస్/ ఐటీ విద్యార్హతల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని ఖాళీలకూ అవివాహిత పురుషులే అర్హులు.
వయసు : జనవరి 1, 2026 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1999 - జనవరి 1, 2006 మధ్య జన్మించిన వారు ఈ పరీక్షకు అర్హులు.
ఆన్‌లైన్ దరఖాస్తులు : మే 29 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు.
